క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగులకు గుర్తింపు ఏది?
భూపాలపల్లిలో అవార్డుల విషయంలో వివక్ష. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల సేవలను భూపాలపల్లి జిల్లాలో అధికారులు విస్మరిస్తున్నారని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-82) టీజీఎన్‌పీడీసీఎల్ కంపెనీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, టీవీఏఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాగుల తిరుపతి రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, విద్యుత్ శాఖ అధికారులు ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేస్తున్నప్పటికీ, విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం తగిన గుర్తింపు దక్కకపోవడం విచారకరమని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆన్‌మ్యాన్డ్ కార్మికులు తరచూ విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇళ్లకు వెలుగులు అందించేందుకు ఆర్టిసన్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు, సబ్‌స్టేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇంతటి బాధ్యతతో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహం, గుర్తింపు అవసరమన్నారు. ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిబద్ధతతో పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందికి ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డులు అందించి ప్రోత్సహిస్తున్నారని, భూపాలపల్లిలో మాత్రం క్షేత్రస్థాయి ఉద్యోగుల సేవలను పట్టించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాకు ప్రత్యేక ఎస్‌ఈ లేకపోవడంతో ములుగు ఎస్‌ఈ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయిందని తిరుపతి రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి, డివిజన్ స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఉద్యోగులకు గుర్తింపు దక్కడం లేదన్నారు. కష్టపడి పనిచేసే తమకు గుర్తింపు లేకపోవడంతో ఆన్‌మ్యాన్డ్ కార్మికులు, ఆర్టిసన్ సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. భవిష్యత్తులోనైనా క్షేత్రస్థాయి ఉద్యోగుల సేవలను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు, అవార్డులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ చైర్మన్ తిరుపతి రెడ్డితో పాటు కన్వీనర్లు మొత్కూరి కోటి, తిప్పరపు రాజు తదితరులు పాల్గొన్నారు.