Take a fresh look at your lifestyle.

ఏఐటీయూసీ పోరాటానికి కీలక విజయం : 23 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయాలు.

0 6

ఏఐటీయూసీ పోరాటానికి కీలక విజయం
23 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయాలు.
హైదరాబాద్ లో ఆర్.ఎల్.సి. సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, ఆగస్టు 27: కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేపట్టిన పోరాటానికి సింగరేణి యాజమాన్యం దిగివచ్చింది. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)తో సింగరేణి యాజమాన్యం సుధీర్ఘ చర్చలు జరిపింది. ఏఐటీయూసీ జూన్ 8న ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన వరుస చర్చల అనంతరం యాజమాన్యం 23 కీలక డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఒప్పందాలకు అంగీకరించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏఐటీయూసీ కొనసాగించిన ఒత్తిడి, పోరాటం ఫలితంగానే యాజమాన్యం పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుందని సంఘం నాయకులు తెలిపారు. ప్రధానంగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను యాజమాన్యం భరించడం, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షలు అందించడం, ప్రతి నెలా మెడికల్‌ బోర్డు నిర్వహించడం, 2025–26 వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు చర్యలు తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ట్రాన్స్‌ఫర్లలో ఉన్న మూడేళ్ల సర్వీస్‌ నిబంధనను తొలగించి ఖాళీల ఆధారంగా ఏడాది నిబంధనతో బదిలీలు చేపట్టేందుకు, అర్హులైన సీనియర్‌ మైనింగ్‌ స్టాఫ్‌కు ఓవర్‌మ్యాన్‌ ప్రమోషన్లు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది. హైదరాబాద్‌లో సింగరేణి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, 22 ఏళ్లుగా మారని మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనల్లో మార్పులు, సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీతో పాటు వారం రోజుల వరకు చికిత్స, సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు, గనుల్లో భద్రతా సామగ్రిని సకాలంలో అందుబాటులో ఉంచడం వంటి అంశాలపైనా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. మందమరి-క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులకు 9 శాతం హెచ్‌ఆర్‌ఏ, పెండింగ్‌లో ఉన్న డిస్మిస్‌ కేసులను హెచ్‌పీసీ కమిటీ ద్వారా పరిష్కరించడం, మైనింగ్‌ స్టాఫ్‌కు అర్హతకు అనుగుణంగా సర్ఫేస్‌ ఉద్యోగాలు కల్పించడం, కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ ఈఎస్‌ఐ వైద్య సదుపాయం కల్పించడం, పెండింగ్‌ డిపెండెంట్‌ ఉద్యోగాల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం వంటి డిమాండ్లను కూడా యాజమాన్యం అంగీకరించింది. ఉద్యోగులు సాంకేతిక విద్యను కొనసాగించేందుకు ఈవెనింగ్‌ కాలేజీల్లో చదువుకోవడానికి ఎన్‌ఓసీలు జారీ చేయడం, ఖాళీగా ఉన్న క్లారికల్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, పారామెడికల్‌, ఎస్‌అండ్‌పీసీ సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం, ఈపీ ఫిట్టర్లు, ఎస్‌డీఎల్‌ ఆపరేటర్లు, సర్వేయర్లు తదితర క్యాడర్‌ స్కీమ్‌ సమస్యలను పరిష్కరించడం వంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి. మెడికల్‌ ఫిట్‌ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్‌ ఆర్డర్లు జారీ చేయడం, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలుపై ప్రభుత్వంతో చర్చించడం వంటి అంశాలపైనా యాజమాన్యం హామీ ఇచ్చింది. చట్టబద్ధమైన సమ్మెలో పాల్గొనే కాంట్రాక్ట్‌ కార్మికులకు నో వర్క్‌–నో పే వర్తింపజేస్తామని, వారికి జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది. ఈ చర్చల్లో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య, వై.వి.రావు, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, ముస్కే సమ్మయ్య పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున డైరెక్టర్‌ గౌతం పోట్రూ, జీఎం పర్సనల్‌ కిరణ్‌కుమార్‌, అజయ్‌, జీఎం ఎంఎస్‌ రవి, డీజీఎం రాజగోపాల్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఈ అంగీకారాలు సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో కీలక మైలురాయిగా నిలిచాయని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.