Take a fresh look at your lifestyle.

సింగరేణి పరిరక్షణకు కార్మిక హక్కుల కోసం పోరాట యాత్ర: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం.

0 4

సింగరేణి పరిరక్షణకు కార్మిక హక్కుల కోసం పోరాట యాత్ర.
గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికులను మోసం చేసే హామీలను నమ్మొద్దు.  

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 30: సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఈసీ సమావేశంలో సింగరేణి కార్మికుల భవిష్యత్తు కార్యాచరణ, కంపెనీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. త్వరలో జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఓట్ల కోసం వివిధ సంఘాల నాయకులు ఇస్తున్న హామీలను కార్మికులు నిశితంగా పరిశీలించాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు సూచించారు. గత 27 ఏళ్ల గుర్తింపు సంఘం ఎన్నికల చరిత్రలో ఏఐటీయూసీ నాలుగు పర్యాయాలు, ఐఎన్‌టీయూసీ రెండు పర్యాయాలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రెండు పర్యాయాలు విజయం సాధించినప్పటికీ, కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులు కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వాల వద్ద తాకట్టు పెట్టారని నాయకులు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న గుర్తింపు సంఘాల పనితీరుపై కార్మికులు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని, మళ్లీ ఓట్ల కోసం కార్మికుల వద్దకు వస్తున్న నాయకులను గతంలో ఇచ్చిన హామీలు, సాధించిన ఫలితాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

గోలేటి నుంచి కొత్తగూడెం వరకు పోరాట యాత్ర:

సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, కంపెనీ భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ జన సమితి, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకత్వంలో త్వరలో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం పోరాట యాత్ర నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. సింగరేణిని కాపాడుకోవడంతో పాటు కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, భవిష్యత్‌ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. కార్మిక ఐక్యతే మన బలం.. కార్మిక హక్కుల సాధనే మన లక్ష్యం అని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నీరేటి రాజన్న, దాసరి జనార్దన్, ప్రసాద్‌రెడ్డి, సమ్ము రాజయ్య, జైపాల్‌సింగ్, గుంపుల సారయ్య, పీక కిరణ్, పి.శ్రీధర్, చంద్రయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.