
మాస శివరాత్రి సందర్భంగా పెద్దమ్మ గుడిలో రుద్రహోమం.
భక్తిశ్రద్ధలతో పూజలు.. దంపతులకు ఆశీర్వచనాలు, శేషవస్త్ర ప్రసాదం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్ 9: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామాల్లో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి)లో మాస శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం రుద్రహోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో నిర్వహించిన రుద్రహోమానికి ముందు మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి, స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి యాగశాలకు తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించి రుద్రహోమాన్ని చేపట్టారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రుద్రహోమంలో పాల్గొన్న దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించి శేషవస్త్ర ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమ్మ గుడి ఆవరణలో అన్నదానం:
శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి) ఆవరణలో నూతక్కి శ్రీనివాసరావు నిర్మించిన అన్నదాన సత్రంలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలం న్యాయవాది నండూరి శ్రీనివాసరావు–దుర్గమోహన్ లక్ష్మీ దంపతులు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గురువారం కొత్తగూడెంకు చెందిన జంగలి నారాయణరావు-లక్ష్మీబాయి దంపతులు అన్నదానం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. అన్నదానం చేయదలచిన భక్తులు దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.