కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ భాష, యాస గౌరవాన్ని పెంచాలి.
ప్రజల గొంతుకగా నిలిచిన మహనీయుడు కాళోజీ: జీఎం దుర్గం రామచందర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మణుగూరు, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో తెలంగాణ భాష, యాస, సంస్కృతి గౌరవాన్ని దశదిశలా చాటేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సింగరేణి మణుగూరు ఏరియా జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎం దుర్గం రామచందర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ భాష, సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమాలకు ఆయన దిక్సూచిగా నిలిచారని అన్నారు. తన జీవితాన్ని తెలంగాణ భాష, సాహిత్య వికాసానికి అంకితం చేసిన కాళోజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆయనకు ఇచ్చే గౌరవానికి నిదర్శనమన్నారు. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేస్తున్న సాహితీవేత్తలను కాళోజీ పేరిట పురస్కారాలతో సత్కరిస్తూ ఆయన సేవలను ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు. కాళోజీ గొప్పతనం, సాహిత్య సేవలు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో భాషా దినోత్సవాన్ని ఉత్సవ వాతావరణంలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మాతృభాషపై అభిమానం, తెలంగాణ సంస్కృతిపై అవగాహన పెంపొందుతుందని అన్నారు. తెలంగాణ బిడ్డలుగా మన భాష, యాస, సంస్కృతి గౌరవాన్ని కాపాడుతూ కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జీఎం దుర్గం రామచందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ టు జీఎం డి. వెంకట రామారావు, ఏరియా ఇంజనీర్ వి. మధన్ నాయక్, ఏజీఎం (ఈఈడీఎం) సి.హెచ్. రాంబాబు, ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేష్, ఏరియా సర్వే అధికారి ఎల్. దయాకర్, క్వాలిటీ హెచ్ఓడీ నాగమేష్, పర్సనల్ హెచ్ఓడీ సుదర్శన్ రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కె. శ్రీనివాస్, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ పి. రమేష్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ బి. శ్యామ్ ప్రసాద్, సీనియర్ పర్సనల్ అధికారులు కె. శ్రీనివాస్, వి. రామేశ్వర్ రావు, ఇతర అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.