సౌదీలో కామారెడ్డి జిల్లా వాసి మృతి
– ఇరవై రోజులకు స్వగ్రామం చేరిన మృతదేహం

కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన కొర్పోల్ శ్యామయ్య బతుకు దేరువు కోసం సౌదీ అరేబియా లోని రియాద్ ప్రాంతానికి ఈ నెల 05 తేదీన వెళ్లారు. తేదీ: 07-07-2024 రోజున ఆరోగ్యం బాగా లేకపోతే తోటివారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తేదీ : 08- 07- 2024 రోజున ఆరోగ్యం క్షీణించి మరణించాడు. రెండు రోజుల తరువాత గ్రామానికి చెందిన గంగయ్యకు ఆర్గొండ నుండి శ్యామయ్య సౌదీ అరేబియా వచ్చాడు ఇంటికి ఫోన్ చేయడం లేదని తెలిపారు. గంగయ్యను శ్యామయ్య ఇంటి వారు ప్రాధేయపడి, దయచేసి వాళ్ళ కంపెనీకి వెళ్లి కనుక్కోమని గంగయ్య కు తెలిపారు. గంగయ్య వాళ్ళ కంపెనీకి వెళ్లి తెలుసుకోగా అతని ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో చేర్పించమన్నారు. గంగయ్య ఆసుపత్రికి వెళ్లి చూసేసరికి శ్యామయ్య మరణించాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. గంగయ్య సౌదీ అరేబియా లోని రియాద్ లో ఉన్న (జి డబ్ల్యు ఏ సి) గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యుడు మహమ్మద్ ఫరూక్ కు తెలిపారు. మహమ్మద్ ఫారూఖ్ శ్యామయ్య మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు పూర్తి భాద్యతలు తీసుకొని, శ్యామయ్య కంపెనీ వాళ్లతో, ఇండియన్ ఎంబీసీ తో మాట్లాడి సరియైన ధ్రువ పత్రాలు తయారు చేసి అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంకట్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, రవి, సల్మాన్ ధ్రువ పత్రాలు సేకరించి ఇండియన్ ఎంబసీ మరియు కంపెనీ సహకారంతో, మృతదేహాన్ని శనివారం ఆర్గొండ గ్రామానికి చేర్చారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఇంటి వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యము కల్పించిన ఎన్ ఆర్ ఐ కార్యాలయ అధికారి చిట్టిబాబుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే 500 కోట్లతో ఎన్ ఆర్ ఐ పాలసీ అమలు చేసి గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు భోరున విలపించారు.