బదిలీపై వెళ్తున్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఘన వీడ్కోలు.
భూపాలపల్లి ఏరియాలో మురళీమోహన్ సేవలు అభినందనీయం: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 10:భూపాలపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఎస్. మురళీమోహన్ సంస్థ భద్రతతో పాటు పోలీసు శాఖతో సమన్వయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. ఆర్జీ-1 ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్తున్న మురళీమోహన్‌కు గురువారం భూపాలపల్లి జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, మురళీమోహన్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి ఏరియాలో భద్రతా ప్రమాణాల అమలుతో పాటు సంస్థ భద్రతకు సంబంధించిన అంశాల్లో మురళీమోహన్ అందించిన సేవలు అభినందనీయమన్నారు. పోలీసు శాఖ అధికారులతో సమన్వయాన్ని పెంపొందించి, పోలీసు శాఖ–సంస్థ మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని జీఎం ప్రశంసించారు. ఆర్జీ-1 ఏరియాలోనూ ఇదే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం పాఠక్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, ఓసీ-2 ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. శ్యామ్ సుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ పి.వి. శంభశివరావు, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, 1 గ్రూప్ ఏజెంట్ ఎం. తిరుపతి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.