
సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి.
2026 ఆర్థిక సంవత్సరానికి 40 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించి చెల్లించాలి.
ఎస్సీసీఎంకేఎస్–బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్.
బిఎంఎస్ ఆద్వర్యంలో సమస్యలపై అన్ని గనులు, డిపార్ట్మెంట్ లలో మెమోరాండం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 15: సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కొత్త గుర్తింపు ఎన్నికలు నిర్వహించి, కొత్త సంఘానికి గుర్తింపు వచ్చే వరకు జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించాలని బిఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సీసీఎంకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2026 ఆర్థిక సంవత్సరానికి కార్మికులకు 40 శాతం లాభాల వాటాను తక్షణమే ప్రకటించి, ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అప్పాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే-1, కేటీకే-5, కేటీకే-8 ఇంక్లైన్లు, ఓసీ-2, ఓసీ-3లలో ఎస్సీసీఎంకేఎస్–బీఎంఎస్ ఆధ్వర్యంలో యాజమాన్యానికి మెమోరాండాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేటికె ఓసీటూలో అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం పదవీకాలం ముగిసినందున ఏ ఒక్క సంఘానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని కార్మిక సంఘాలను సమానంగా పరిగణించడం యాజమాన్యం బాధ్యత అని అన్నారు. కార్మికుల సమస్యలపై నిర్వహించే సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు, అధికారిక కార్యక్రమాలకు అన్ని సంఘాలను సమానంగా ఆహ్వానించాలని కోరారు. అలాగే యాజమాన్యం ముందు కార్మికుల సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేసే సమాన అవకాశాన్ని అన్ని సంఘాలకు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికుల శ్రమ కీలకమైనదని పేర్కొన్న ఆయన, 2026 ఆర్థిక సంవత్సరానికి 40 శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించి కార్మికులకు చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికులు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం రెండు ప్రధాన అంశాలపై సానుకూలంగా స్పందించి తక్షణమే న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎస్సీసీఎంకేఎస్–బీఎంఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ మెమోరాండం సమర్పించిన వారిలో కేటీకే-1 ఇంక్లైన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి రాసకట్ల నర్సింగరావు, పిట్ కార్యదర్శి ఓరం లక్ష్మణ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు. కేటీకే-5 ఇంక్లైన్‌లో సంఘం భూపాలపల్లి బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ వెలబోయిన సుజంధర్, పిట్ కార్యదర్శి రాజు నాయక్, దేవరనేని సమ్మయ్య, సీనియర్ నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్ పాల్గొన్నారు. కేటీకే-8 ఇంక్లైన్‌లో బ్రాంచి కార్యదర్శి రేణికుంట్ల మల్లేష్, బ్రాంచి నాయకులు ప్రేమ్ సింగ్, కడారి శంకర్, డి. నారాయణ, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి శీలం రాజు, భరత్ పాల్గొన్నారు. ఓసీ-2 వద్ద ఎస్సీసీఎంకేఎస్–బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, సెంట్రల్ కార్యదర్శి సట్కూరి శ్రీనివాస్, కోశాధికారి రఘుపతి రెడ్డి, మాచర్ల నరహరి, సుధాకర్ పాల్గొన్నారు. ఓసీ-3 వద్ద బ్రాంచి నాయకుడు ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.