Take a fresh look at your lifestyle.

సింగరేణిలో అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలి : బడితెల సమ్మయ్య.

0 6

సింగరేణిలో అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలి.
40 శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలి.
టీబీజీకేఎస్ భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 15: సింగరేణి సంస్థలో ట్రేడ్ యూనియన్ల రెండేళ్ల పదవీకాలం ముగిసినందున గుర్తింపు సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, అందులో కార్మికులకు 40 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేటీకే ఓసీ-2 గనితో పాటు భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నల్లబెల్లి సదానందం మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నాటికి ట్రేడ్ యూనియన్ల రెండేళ్ల కాలపరిమితి పూర్తయిందని తెలిపారు. దీంతో యాజమాన్యం తక్షణమే స్పందించి గుర్తింపు సంఘంతో పాటు అన్ని యూనియన్లను సమానంగా చూడాలని కోరారు. కార్మికులకు అవసరమైన సేఫ్టీ పరికరాలైన బూట్లు, గ్లౌజులు, హెల్మెట్లు సక్రమంగా సరఫరా కావడం లేదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గనుల్లో వినియోగించే యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో యంత్రాలు సక్రమంగా పనిచేయక బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల భద్రతకు అవసరమైన పరికరాలతో పాటు యంత్రాలకు అవసరమైన స్పేర్ పార్ట్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, ఆ లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటాను చెల్లించాలని నాయకులు కోరారు. లాభాల వాటా ప్రకటనలో జాప్యం చేస్తే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, ప్రయోజనాల పరిరక్షణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు బత్తిని సుదర్శన్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ ఇ. రవీందర్, బ్రాంచి నాయకులు ఆకుల శ్రీనివాస్, మాజీ పిట్ సెక్రెటరీ ఈరవేణి రాయమల్లు, చెక్క నారాయణ, తిరుపతి రెడ్డి, చిలువేరు కుమార్, వెంకట్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.