భూపాలపల్లి గనుల్లో ప్రమాదాలు అరికట్టాలి : మిర్యాల రాజిరెడ్డి.
అమూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు పరామర్శ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 24: భూపాలపల్లి డివిజన్‌లోని కేటీకే-8 ఇంక్లైన్‌తో పాటు ఇతర గనుల్లో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టి కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అమూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూపాలపల్లి సింగరేణి కార్మికులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో భూపాలపల్లికి చెందిన నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో సుధాకర్, రమేష్, మొగిలి తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. కార్మికులకు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు గనుల్లో ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రులకు తరలించే సమయంలో వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది కార్మికుల గాయాల్లో బొగ్గు ముక్కలు ఇంకా ఉండిపోయినట్లు వైద్యులు తెలిపారని, తద్వారా ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా సింగరేణి వైద్యులు, యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గనుల్లో ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కేటీకే-8లో ట్రామింగ్, రూఫ్ తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలు లోపిస్తున్నాయని, అవసరమైన స్పేర్స్ అందుబాటులో లేకపోవడం, గతంలో ఏర్పాటు చేసిన పుల్లీకి డాబర్ ప్లేట్ లేకపోవడం వంటి సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ప్రత్యేక దృష్టి సారించి గనుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క అమూర్ ఆస్పత్రిలోనే భూపాలపల్లి ప్రాంతానికి చెందిన నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్న పరిస్థితి సింగరేణి గనుల్లో భద్రతా సమస్యల తీవ్రతను తెలియజేస్తోందన్నారు. వివిధ ఆస్పత్రుల్లో మైనింగ్ ప్రమాదాలకు గురై చికిత్స పొందుతున్న కార్మికుల సమస్యలను యాజమాన్యం గుర్తించి, ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని రాజిరెడ్డి కోరారు. ఆయన వెంట టిబిజికేఎస్ భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బడితెల సమ్మయ్య, టిబిజికేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్ ఉన్నారు.