Take a fresh look at your lifestyle.

జనగణనలో బీసీ కులగణన చేయాలి : బీసీ హక్కుల సాధన సమితి.

0 2

జనగణనలో బీసీ కులగణన చేయాలి.

జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి : బీసీ హక్కుల సాధన సమితి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 21: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో బీసీ కులగణనను ప్రత్యేకంగా నిర్వహించి, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక గుర్తింపు (యూనిక్‌ కోడ్‌) కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బీసీల జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఖమ్మం బైపాస్‌ రోడ్డులోని గిరిప్రసాద్‌ భవన్‌లో రావుల హన్మంతరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన బీసీ సబ్‌కమిటీ సమావేశంలో తాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలు సాగించిన ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో జనగణనలో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని విస్మరించి బీసీలను వంచించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గృహ సమగ్ర సర్వే ప్రశ్నావళిలో కులగణనకు స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం సరికాదన్నారు. ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే విభాగాలు మాత్రమే ఉండటంతో బీసీల కులాల వారీ జనాభా లెక్కలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ కేటాయించి, శాస్త్రీయ, ప్రణాళికాబద్ధమైన విధానంలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీల జనాభా గణాంకాలు అందుబాటులోకి వస్తే జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తగిన వాటా లభించే అవకాశం ఉంటుందని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లోనూ బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జనగణన ప్రశ్నావళిలో బీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసిన తర్వాతే దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో రాజకీయాలకు అతీతంగా బీసీలంతా సంఘటితమై ఉద్యమిస్తారని హెచ్చరించారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర మహాసభలను అక్టోబర్‌ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 10 వరకు సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీల ఎన్నికలు, అక్టోబర్‌ 12 నుంచి 30 వరకు మండల మహాసభలు నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 1న ఖమ్మంలో జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు శింగు నర్సింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు పగడాల మల్లేష్‌, కోశాధికారి గాదె లక్ష్మినారాయణ, సహాయ కార్యదర్శి ఆకెన పవన్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.