
సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి.
కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమం తప్పదు : ఎంపీ ఈటల రాజేందర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల/శ్రీరాంపూర్, సెప్టెంబర్ 30: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను అసలు, వడ్డీతో సహా వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగరేణి ధర్నా’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఒకప్పుడు 1.16 లక్షల మంది పర్మినెంట్ కార్మికులు ఉండగా ప్రస్తుతం సుమారు 39 వేల మంది మాత్రమే ఉన్నారని, మరో 70 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. వీరిపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. సింగరేణికి సొంత నిధులు లేక 9 నుంచి 12 శాతం వడ్డీకి అప్పులు తెచ్చుకుని కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బకాయిలు రూ.54 వేల కోట్లకు పైగా ఉన్నాయని జూలైలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పేర్కొన్నారు. కార్మికులను డిస్మిస్‌ల పేరుతో వేధించడం నిలిపివేయాలని, కొత్తగా చేపట్టిన పీఏఏ డిస్మిస్‌లను ఆపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.1,250 చెల్లిస్తుండగా సింగరేణిలో రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటూ, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.1,250 చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, సింగరేణి నేరుగా కార్మికులను నియమించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసి కీలక పాత్ర పోషించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కార్మికుల జీవితాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 48 అండర్‌గ్రౌండ్ గనులు ఉండగా ప్రస్తుతం 24కు తగ్గాయని పేర్కొన్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులను కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చే విధానాల వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. నాణ్యమైన బొగ్గును ప్రైవేటు సంస్థలకు తరలించడం వల్ల సింగరేణికి నష్టం వాటిల్లుతోందని, 30 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దొంగతనం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణి నుంచి బొగ్గు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అండర్‌గ్రౌండ్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా పరికరాలు అందించడం లేదని, కార్మికులు, వారి కుటుంబాలకు అవసరమైన మందులు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్లే సంస్థలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. విద్యుత్ సరఫరా అంతరాయాలతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో రహదారులు వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సి ఉండగా, సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ కార్యక్రమానికి ఖర్చు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. సింగరేణి ప్రకృతి ప్రసాదించిన సంపద అని, దానిని కొద్దిమంది పెట్టుబడిదారులు, బ్రోకర్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. సింగరేణి కార్మికులతో తనకు అవినాభావ సంబంధం ఉందని, గతంలో వారు తనకు అండగా నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు తమ హక్కులు, సంస్థ భవిష్యత్తు కోసం అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి ఆలోచించాలని కోరారు. సింగరేణిని కాపాడేందుకు, కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ క్రియాశీలంగా పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, సీనియర్ నాయకురాలు కందుల సంధ్యారాణి, చొప్పరి వేణు, శ్రీహరి రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్, సునీల్ రెడ్డి, ముఖేష్ గౌడ్, హేమాజీ, కొంపల్లి శ్రీనివాస్, సింగరేణి కోల్ మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్, బాపు రాజు, వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, సింగరేణి సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.