
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు.
మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలింపు.
స్ట్రీట్‌లైట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని కార్మికుల ఆరోపణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 22:భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్ గనిలో సపోర్ట్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు పెసర మహేష్ సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు తరలించినట్లు సమాచారం. తూండ్ల గ్రామానికి చెందిన మహేష్ భూపాలపల్లిలో ఇంటి అవసరాల కోసం సరుకులు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా రాత్రి 9 గంటలకు ప్రమాదానికి గురయ్యాడు. కేటీకే ఓసీ-2 నుంచి కేటీకే-1 గనికి వెళ్లే రహదారిపై గడ్డిగానిపల్లి గ్రామం సమీపంలోని మూలమలుపు వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని అతని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను సమాచారం అందుకున్న తోటి కార్మికులు వెంటనే స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హనుమకొండలోని మాక్స్‌కేర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి కేటీకే ఓసీ-2 నుంచి కేటీకే-1 గని వరకు రహదారిపై స్ట్రీట్‌లైట్లు సక్రమంగా వెలగకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా వీచిన బలమైన గాలులకు రహదారిపై చెట్లు పడిపోవడంతో పాటు, సోమవారం మధ్యాహ్నం నుంచి మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన లారీకి రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు లేదా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. చీకటి, తగినంత వెలుతురు లేకపోవడం, రహదారిపై నిలిపి ఉంచిన వాహనానికి భద్రతా సూచనలు లేకపోవడం వంటి కారణాల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కార్మికులు చెబుతున్నారు. గనుల పరిసర ప్రాంతాల్లో రహదారి భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, స్ట్రీట్‌లైట్లను వెంటనే పునరుద్ధరించాలని వారు సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నారు.