Take a fresh look at your lifestyle.

మణుగూరులో లారీ హెడ్‌లైట్ల కాంతితో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కార్మికుడికి తీవ్ర గాయాలు.

0 5

లారీ హెడ్‌లైట్ల కాంతితో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కార్మికుడికి తీవ్ర గాయాలు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.
ఓసీ-2 మార్గంలో లైటింగ్ పెంచి.. లారీల వేగాన్ని నియంత్రించాలి.
టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మణుగూరు, అక్టోబర్ 7: మణుగూరు సింగరేణి ఏరియా ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్-2లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న 146 బ్యాచ్‌కు చెందిన కార్మికుడు బానోత్ అర్జున్ మంగళవారం రాత్రి డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వచ్చిన లారీకి అమర్చిన అధిక కాంతి లైట్లు నేరుగా కళ్లలో పడటంతో రహదారి కనిపించక వాహనం అదుపుతప్పి కిందపడినట్లు తోటి కార్మికులు తెలిపారు. ప్రమాద సమయంలో అర్జున్ హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వారు తెలిపారు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు అంబులెన్స్‌లో అతడిని మణుగూరు సింగరేణి వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మణుగూరు ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి రాత్రి సుమారు 12 గంటలకు ఆసుపత్రికి చేరుకుని అర్జున్‌ను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అర్జున్‌ను కొత్తగూడెం సింగరేణి వైద్యశాలకు తరలించారు. కొత్తగూడెం వైద్యులతో నాగెల్లి చరవాణిలో మాట్లాడగా.. హెల్మెట్ లేకపోవడంతో కంటి పైభాగంలోని ఎముక, దవడ భాగంలో ఫ్రాక్చర్లు అయినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారని నాగెల్లి తెలిపారు. ఈ సందర్భంగా నాగెల్లి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి కార్మికుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేగ నియంత్రణ పాటిస్తూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ప్రతి కార్మికుడి ప్రాణ రక్షణకు ఎంతో కీలకమని అన్నారు. ప్రకాశం ఖని అండర్ బ్రిడ్జి నుంచి ఓపెన్‌కాస్ట్-2 వరకు రహదారిపై తగినంత లైటింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మార్గంలో డ్యూటీ సమయాల్లో లారీలు అధిక వేగంతో నడుస్తున్నాయని, వాటి వేగాన్ని నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోడింగ్ లారీలపై బొగ్గును కప్పే పట్టాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో బొగ్గు పెళ్లలు రోడ్డుపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా లారీల ముందు భాగంలో అమర్చిన అధిక కాంతి లైట్లు ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకి నేరుగా పడటంతో రహదారి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం ఖని అండర్ బ్రిడ్జి నుంచి ఓసీ-2 వరకు లైటింగ్‌ను మెరుగుపరచడంతో పాటు లారీల వేగాన్ని నియంత్రించి, అధిక కాంతి లైట్ల వినియోగంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను నాగెల్లి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగం రాజ్‌కుమార్, సాంబార్ రాజశేఖర్, ఆపరేటర్ రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.