Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో రోడ్డు విస్తరణను స్వాగతిస్తున్నాం : మోటపలుకుల రమేష్.

0 1

రోడ్డు విస్తరణను స్వాగతిస్తున్నాం : మోటపలుకుల రమేష్.

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి.
అభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం సరికాదు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 7: భూపాలపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను స్వాగతిస్తున్నామని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. బుధవారం ఓ స్థానిక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ పార్టీ, కార్మిక లేదా ఉద్యోగ సంఘం అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తే చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంబేద్కర్ సెంటర్‌ నుంచి ఓసీ-2 వరకు, అలాగే కేటీకే-6 ఇంక్లైన్ వద్ద నిర్మిస్తున్న కోర్టు సముదాయాల వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పట్టణ రూపురేఖలను మార్చే కార్యక్రమమని రమేష్ అన్నారు. సుమారు 200 అడుగుల రోడ్డు కోసం సేకరిస్తున్న భూమిలో అధికభాగం సింగరేణికి చెందినదేనని, ఈ అభివృద్ధి పనులను ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్వాగతిస్తున్నాయని తెలిపారు. అయితే రోడ్డు విస్తరణతోపాటు పక్కనున్న నివాస ప్రాంతాలకు ఇబ్బందులు కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు విస్తరణ కారణంగా ఉపాధి కోల్పోయే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వ్యాపార సదుపాయాలు కల్పించాలని, వారి జీవనోపాధికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సింగరేణి భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉండగా, సంస్థ అనుమతి లేకుండా కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయని రమేష్ పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అలాంటి నిర్మాణాలు తొలగించాల్సి వచ్చినా దానిని రాజకీయ అంశంగా మార్చడం సరికాదన్నారు. తమ ఏఐటీయూసీ కార్యాలయానికి చెందిన పట్టా భూమిలో కొంత భాగం కూడా రోడ్డు విస్తరణలోకి వస్తున్నప్పటికీ, పట్టా లేదా రిజిస్ట్రేషన్ భూమి అనే తేడా లేకుండా పట్టణ అభివృద్ధి కోసం స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ, టీబీజీకేఎస్, బీఎంఎస్ లేదా ఇతర సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించకుండా సహకరించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్డు విస్తరణ వంటి మౌలిక వసతుల పనులకు అందరూ సహకరించాలని రమేష్ అన్నారు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో నిజంగా జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల కడుపు కొట్టకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల జీవనోపాధిని కాపాడుతూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.