Take a fresh look at your lifestyle.

సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి : విద్యుత్‌ సౌధ ముట్టడి చేసిన ఏఐటీయుసి.

0 2

సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి.
ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకుంటే జెన్‌కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేత దిశగా ఉద్యమం.
ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌ హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్భ/భద్రాద్రి-కొత్తగూడెం, అక్టోబర్ 13: సింగరేణి కాలరీస్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) డిమాండ్‌ చేసింది. బకాయిల చెల్లింపుపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే జెన్‌కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేత దిశగా పోరాటాన్ని తీసుకెళ్తామని యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ హెచ్చరించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతమైంది. సింగరేణి పరిధిలోని 12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, యూనియన్‌ నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చి విద్యుత్‌ సౌధ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సింగరేణి ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యూసఫ్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు సుమారు రూ.26 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవి సుమారు రూ.59 వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. గతంలో బకాయిల అంశంపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా సింగరేణి ఆర్థిక సమస్యలు, కార్మికుల ఇబ్బందులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోందని నాయకులు అన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను చెల్లించడం ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. సంస్థకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు పేరుకుపోవడం వల్ల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడటమే కాకుండా, భవిష్యత్తులో కార్మికులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపులపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి, నిధుల విడుదలకు గడువుతో కూడిన ప్రణాళికను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి బొగ్గును వినియోగిస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరాలు కొనసాగుతున్నప్పటికీ, బొగ్గు సరఫరాకు సంబంధించిన బకాయిలు పేరుకుపోవడం సంస్థకు ఆర్థిక భారంగా మారుతోందని నాయకులు పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తన కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకోవాలన్నా, కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలన్నా రావాల్సిన బకాయిల వసూళ్లు అత్యంత కీలకమని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు ఎంత అవసరమో, బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థ ఆర్థిక పరిపుష్టి కూడా అంతే ముఖ్యమని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యుత్‌ సౌధ ముట్టడి ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక అని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా బకాయిల చెల్లింపుపై సానుకూల నిర్ణయం వెలువడకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. అవసరమైతే జెన్‌కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేత దిశగా పోరాటాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన హక్కులు, సంస్థ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలోని 12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, నాయకులు తరలివచ్చి ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం యూనియన్‌పై కార్మికులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని నాయకులు అన్నారు. బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులను సమీకరిస్తూ దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్‌, బ్రాంచ్‌ కార్యదర్శులు ఎస్‌.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య, సముద్రాల సుధాకర్‌, బాజీ సైదా, మోట పలుకుల రమేష్‌, ఎమ్మార్సీ రెడ్డి, రాంగోపాల్‌, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్‌, సుధాకర్‌, నజీర్‌, రంగు శ్రీనివాస్‌, గంధం సాంబశివరావుతో పాటు అన్ని ఏరియాల కార్యవర్గ సభ్యులు, వివిధ కమిటీల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.