
సింగరేణి కార్మికులకు దసరా కానుక.
2025-26 సంవత్సరానికి 34 శాతం లాభాల వాటా…ఒక్కొక్కరికి రూ.1,53,912.
38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులకు ప్రయోజనం. 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్.
సొంతింటి కల సాకారం.. పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలకు 15 రోజుల్లో పరిష్కారం.
కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనకు ప్రత్యేక కార్యాచరణ. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన.
సింగరేణిని దెబ్బతీసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు పోరుబాట హాస్యాస్పదం: మంత్రి శ్రీధర్‌బాబు.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 13: సింగరేణి బొగ్గు గని కార్మికులు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీని ప్రకారం ఒక్కో పర్మినెంట్ ఉద్యోగికి సగటున రూ.1,53,912 చొప్పున లాభాల వాటా అందనుంది. మొత్తం 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులు లబ్ధి పొందనుండగా, 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ చెల్లించనున్నారు. ఈ ఏడాది సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో రూ.596.36 కోట్లను కార్మికుల లాభాల వాటా కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత, ఆరోగ్యం, గృహవసతి, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సంస్థకు చెందిన భూముల్లో ఇప్పటివరకు మైనింగ్ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, నివాస గృహాల నిర్మాణానికి అనువైన లేఅవుట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరు మీద ‘నెహ్రూ హౌసింగ్ కాలనీ’ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. సింగరేణి నుంచి రెవెన్యూ శాఖకు తిరిగి అప్పగించిన 5,774 ఎకరాల భూముల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 4,500 ఎకరాలను పేదలకు పట్టాల రూపంలో అందించారని గుర్తుచేశారు. మిగిలిన సుమారు 1,250 ఎకరాలకు సంబంధించి జీవో నంబర్ 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఉద్యోగ ఉత్తర్వులు, సంబంధిత చట్టపరమైన ప్రక్రియలను 15 రోజుల్లో పూర్తి చేసి అర్హులకు ఉత్తర్వులు అందించాలని ఆదేశించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 136 నుంచి గరిష్ఠంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆయా ఆసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరుకాక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులను వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ కిట్లు తప్పనిసరిగా పంపిణీ చేయాలని, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే కార్మికుల పెర్క్స్, అలవెన్స్‌లపై ఆదాయపన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఆక్రమిత నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారుల సమగ్ర జాబితా రూపొందిస్తామని, ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఏరియా ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం:
సింగరేణి పరిధిలోని ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సామాన్య కార్మికులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. అవసరమైతే వైద్యుల వేతనాలు, పారితోషికాలను పెంచి నిపుణులను నియమిస్తామని, అత్యవసర వైద్యం కోసం కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. బొగ్గు గనులు, ఓవర్‌బర్డెన్ డంప్‌ల నుంచి వెలువడే దుమ్ము వల్ల ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని సూచించినట్లు తెలిపారు. ఖరీదైన పట్టణ, వాణిజ్య భూములను కాకుండా పట్టణాలకు వెలుపల ఉన్న నిరుపయోగ భూములు, ఓవర్‌బర్డెన్ గుట్టలను సోలార్ ప్లాంట్లకు వినియోగించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి నుంచి స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని, ఇందుకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ పరిధిలోని నిరుపయోగ గుట్టల భూములకు సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సత్తుపల్లి, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనపై దృష్టి:
గత ఏడాదితో పోలిస్తే సింగరేణి లాభాలు తగ్గడానికి కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమవడం ప్రధాన కారణమని భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనే అవకాశాన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదని ఆరోపించారు. సుమారు 141 బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడంతో సంస్థ వ్యాపార విస్తరణకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఉన్న బ్లాక్‌లలో కొన్ని మూతపడుతుండటంతో ఉత్పత్తి, ఆదాయంపై ప్రభావం పడుతోందని, దాదాపు 14 బ్లాక్‌లు మూతపడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను సాధించాల్సిన అవసరం ఉందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్-3, మణుగూరు పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్, నైని వంటి బ్లాక్‌లను సాధించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏ మైనింగ్ సంస్థ అయినా నిరంతరం కొత్త బ్లాక్‌లను సాధిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటేనే ఆర్థికంగా బలోపేతమవుతుందని పేర్కొన్నారు. సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ఉపాధి భద్రత, బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కొత్త బ్లాక్‌ల సాధన కీలకమని స్పష్టం చేశారు.
మార్కెట్‌కు అనుగుణంగా బొగ్గు ధరలు:
ప్రస్తుతం బొగ్గు మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొందని భట్టి విక్రమార్క తెలిపారు. మహానది, కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌తోపాటు ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గును సరఫరా చేస్తున్నాయని చెప్పారు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉండటంతో కొన్ని సంస్థలు ఇతర వనరుల నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు ధరలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ధరలను సర్దుబాటు చేయకపోతే కొనుగోలుదారులను కోల్పోయి ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సంస్థ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యుత్ సంస్థల బకాయిలు దశలవారీగా చెల్లింపు:
సింగరేణికి విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావించారు. గత పదేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి రావాల్సిన మొత్తాలను దశలవారీగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బకాయిలు ఎప్పుడు పేరుకుపోయినా వాటిని చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలదేనని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేం సాగర్‌రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణరావు, విజయరామారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టర్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబులను శాలువాలతో సత్కరించారు.