స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
– డిఆర్ డి ఓ సాయ గౌడ్
కమ్మర్ పల్లి, ఆగష్టు 05 (లోకంతీరు) : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ పిలుపునిచ్చారు.సోమవారం కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారి హోదాలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ర్యాలీ, గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.ముందుగా కమ్మర్ పల్లి గ్రామపంచాయతీ ఆవరణ నుంచి భారీ సంఖ్యలో మహిళలు మార్కెట్ విధి గుండా జాతీయ రహదారి నుంచి హై స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం హై స్కూల్ ఆవరణలో స్వచ్ఛధనం పచ్చదనంపై ప్రతిజ్ఞ చేశారు.తర్వాత జరిగిన గ్రామసభను ఉద్దేశించి డిఆర్డిఓ సాయ గౌడ్ ప్రసంగించారు.
ఈ కార్యక్రమం నేటి నుంచి ఐదు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా పల్లెల్లో శుభ్రతతో పాటు చెట్లను సంరక్షించడం మొక్కలు నాటడం వాటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణ పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.అంతకుముందు ఎంపీడీవో రాజ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండల అధికారులు కలిసి భారీ సంఖ్యలో హాజరైన మహిళల ర్యాలీని ప్రారంభించారు. హై స్కూల్ ఆవరణలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా డి ఆర్ డి ఓ సాయ గౌడ్ మరియు అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ ఏపీవో విద్యానంద్ పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
