వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు
– ఐ.యుఫ్.టి.యు డిమాండ్

నిజామాబాద్, సెప్టెంబర్ 12( లోకంతీరు ) : భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ( ఐ.యుఫ్.టి.యు ) జిల్లా కమిటీగా కార్మిక శాఖ సహాయ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి అమలు చేస్తున్న ప్రమాదబీమా రూ.6,30,000 నుండి రూ.5 లక్షలకు తగ్గించి సహజ మరణం బీమా రూ.1,30,000/-లు, శాశ్వత అంగవైకల్యం రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం రూ.4 లక్షలు ఈ సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ లేకుండానే అసత్యాలతో బోర్డు ఆమోదంతోనే టెండర్లను పిలుస్తున్నట్లు ప్రకటించిండం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఉంటే, 15.9 లక్షల మంది బోర్డులో రెన్యూవల్ చేసుకున్న వర్కర్స్ మాత్రమే ఉన్నట్లు చూపారన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను బిల్డింగ్ కార్మికులకు అందకుండా చేసి, కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉన్నదన్నారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టటం కోసమే ప్రభుత్వం టెండర్లకు పిలుస్తున్నదని ఆరోపించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం వలన నేడు కార్మికులకు వస్తున్న స్కీములు అందకుండా పోతాయన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి తప్పులు వెతికి కార్మికులకు నష్టపరిహారాలు అందకుండా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు నిధులను బడా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు దోచీపెట్టడం, అధికారుల కమీషన్ల కోసమే కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమ పథకాలు ఇన్స్యూరెన్స్ కంపెనీల లాభాల కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయరెడ్డి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.