సింధు హాస్పిటల్‌లో సింగరేణి హెల్ప్ డెస్క్ ప్రారంభం.
ఉద్యోగులు, పెన్షనర్లకు వేగవంతమైన వైద్య సేవలే లక్ష్యం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 21:సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు నాణ్యమైన, సులభతరమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్‌లో ప్రత్యేక సింగరేణి హెల్ప్ డెస్క్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలకోటయ్య, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించే ఈ కార్యక్రమం సింగరేణి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సింధు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అంథోనీ లాజర్ బాసిల్ మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు, ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆసుపత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హెల్ప్ డెస్క్ ద్వారా రోగులకు వేగవంతమైన సేవలు, అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, ప్రత్యేక సహకారం అందించేందుకు ఈ హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ అధికారులు సురేష్ కుమార్, నాగ వంశీ, బిల్లింగ్ అధికారులు కృష్ణారెడ్డి, జగదీశ్వరి, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆళవందార్ వేణుమాధవ్, బీరయ్య, రఫిక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.