Take a fresh look at your lifestyle.

సింగరేణిలో రూ.1000 కోట్ల స్కాం – మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ.

0 32

సింగరేణిలో రూ.1000 కోట్ల స్కాం.

బొగ్గు ఉత్పత్తి, ఓబీ రిమూవల్, సోలార్ ప్రాజెక్టుల్లో భారీ అవకతవకలు.

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, జూన్ 12:

సింగరేణి సంస్థలో రూ.1000 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని, బొగ్గు ఉత్పత్తి, ఓబీ రిమూవల్, సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న హరీశ్‌రావు శుక్రవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓసీ-2 గనిని సందర్శించేందుకు వెళ్లగా భద్రతా నిబంధనలను కారణంగా చూపుతూ అధికారులు అనుమతి నిరాకరించారు. అనంతరం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్మికులకు వివరించారు. సోలార్ పవర్ స్కాం, డీజిల్ స్కాం, ఓబీ రిమూవల్ స్కాం, బొగ్గు ఉత్పత్తి స్కాం వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ఓబీ రిమూవల్ టెండర్లలో కొత్తగా “సైట్ విజిటింగ్ సర్టిఫికెట్” విధానాన్ని ప్రవేశపెట్టి కొందరికి అనుకూలంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంధువులకు చెందిన సంస్థలకు ప్రయోజనం చేకూరేలా చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు మైనస్ 10 శాతం బిడ్డింగ్‌తో జరిగేవని, ప్రస్తుతం ప్లస్ 13 శాతం బిడ్డింగ్‌తో కాంట్రాక్టులు కేటాయిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

 

సోలార్ ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలు:

 

సింగరేణిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సుమారు రూ.1000 కోట్ల స్కాం జరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు. సాధారణంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, అయితే సింగరేణిలో ఒక్క మెగావాట్‌కు రూ.7 కోట్ల వరకు వ్యయం చూపుతున్నారని అన్నారు. ఈ తేడా ద్వారా భారీ కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు.

 

ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోలుకు అవసరమైన అనుమతులు, ఒప్పందాలు లేకుండానే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

బొగ్గు నిల్వలు, ఉత్పత్తి గణాంకాల్లో అక్రమాలు:

 

సింగరేణి వ్యాప్తంగా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అయితే వాటి వివరాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. భూపాలపల్లి ఏరియాలోనే సుమారు 3.07 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కార్మికులను ఉద్దేశించి “మీ గనుల్లో బొగ్గు నిల్వలు ఉన్నాయా?” అని ప్రశ్నించగా, కార్మికులు “లేవు” అని సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో గని మేనేజర్లు, జనరల్ మేనేజర్లను నిలదీయాలని కార్మికులకు సూచించారు.

 

బీఆర్ఎస్ నాయకులు పర్యటిస్తున్న సందర్భాల్లో రోజువారీ ఉత్పత్తి గణాంకాలను తక్కువగా చూపిస్తూ లోటును భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మట్టి కుప్పలపై బొగ్గు పరచి నిల్వలు ఉన్నట్లు చూపిస్తూ కార్మికులను, ప్రజలను, రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

 

సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టారు:

 

సింగరేణి సంస్థ అప్పుల అంశంపై మాట్లాడిన హరీశ్‌రావు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే సంస్థపై సుమారు రూ.19 వేల కోట్ల అప్పు ఉందని గుర్తు చేశారు. తమ పాలనలో మరో రూ.16 వేల కోట్ల వరకు అప్పులు చేసినప్పటికీ ఆ నిధులతో ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు.

 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే రూ.20 వేల కోట్లకు పైగా అప్పులు చేసి సింగరేణిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం:

 

సింగరేణిలో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, కార్మికుల హక్కులు, సంస్థ భవిష్యత్తు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అనంతరం ఆయన సింగరేణిపై తను చేసిన ఆరోపణలపై ఒక పీపీటి ప్రదర్శించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, తెలంగాణ వికలాంగుల సంక్షేమ సంఘం మాజీ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సాంబారి సమ్మారావు, భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడిదల సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు రఘుపతిరావు, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, గడ్డం కుమార్‌రెడ్డి, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు దేవరకొండ మధు, రత్నం అవినాష్, కౌన్సిలర్ రత్నం సుమాంజలి, నరేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.