Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో విధి నిర్వహణలోనే విషాదాంతం.. లారీ ఢీకొని డీటీవో వెంకన్న దుర్మరణం.

0 26

విధి నిర్వహణలోనే విషాదాంతం..లారీ ఢీకొని డీటీవో వెంకన్న దుర్మరణం.
25 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీ..రవాణా శాఖలో విషాద ఛాయలు.
ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు హరీష్  రావు డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 22:ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి, అదే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం భూపాలపల్లి జిల్లాను విషాదంలో ముంచెత్తింది. జిల్లా రవాణా అధికారి (డీటీవో) వెంకన్న సోమవారం ఉదయం చెల్పూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే, జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ వద్ద ఉన్న ఆర్టీవో కార్యాలయం సమీపంలో వెంకన్న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన వెంకన్నను ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. కేవలం 25 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన వెంకన్న, తన కర్తవ్యనిష్ఠ, క్రమశిక్షణతో సహచర అధికారుల మన్ననలు పొందారు. అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందడం రవాణా శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంకన్న మృతివార్త తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకన్న ఆకస్మిక మృతితో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారికి ప్రభుత్వం తగిన గౌరవం అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు కూడా ఘటనపై స్పందించారు. “ఇసుక, బొగ్గు అక్రమ రవాణాను అడ్డుకుంటే అధికారులను చంపేస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రమాదమా, లేక మరేదైనా కోణం ఉందా అన్న అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోంది. వెంకన్న మరణం జిల్లా ప్రజలను, రవాణా శాఖను తీవ్ర విషాదంలో ముంచెత్తగా, ఆయన సేవలను సహచరులు, ప్రజలు స్మరించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.