
భువనగిరిలో ‘రిస్క్’ సందడి.
హీరో సందీప్ పాశ్వకు అభిమానుల ఘన స్వాగతం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
యాదాద్రి-భువనగిరి, జూన్ 27:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం ‘రిస్క్’ సినిమా సందడి నెలకొంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర హీరో సందీప్ పాశ్వ స్థానిక వసుంధర థియేటర్ను సందర్శించి అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా అభిమానులు టపాసులు కాల్చి, హర్షధ్వానాలతో హీరోకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సందీప్ పాశ్వ మాట్లాడుతూ, ‘రిస్క్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. భువనగిరి ప్రజలు తనను తమ బిడ్డగా ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రేమాభిమానాలు కొనసాగించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ, భువనగిరి ముద్దుబిడ్డ సందీప్ పాశ్వ సినీ రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. చిత్ర నిర్మాత రావి శైలజ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, తొలి చిత్రంతోనే సందీప్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘రిస్క్’ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ, తొలి చిత్రంలోనే సందీప్ అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారని ప్రశంసించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని, నాణ్యమైన చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు సానియా ఠాకూర్, జోయా జోవేరి, కెమెరామెన్ జగదీష్, పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, వెల్లముల జంగయ్య యాదవ్, భువనగిరి శ్రీనివాస్, సుక్క స్వామి, చిక్కుల వెంకటేష్, కొండాపురం గణేష్, పెంటారెడ్డి, చెట్టోజు గోపాల్, డాక్టర్ జగదీష్, గాదే కరుణాకర్, జమాల్ తదితరులు పాల్గొన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.