సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి.
గనుల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలి.
ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 28:సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం వల్ల పలు నియర్-మిస్ ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగంపై మైనింగ్ సిబ్బంది, ముఖ్యంగా షార్ట్ ఫైరర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అండర్‌గ్రౌండ్ గనుల్లో తడి ప్రాంతాల్లో బ్లాస్టింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, అలాగే ఎలక్ట్రానిక్ డిటోనేటర్లలో డిజిటల్ సందేశాలు కొన్నిసార్లు తప్పుగా ప్రదర్శించబడుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో బ్లాస్టింగ్ జరగకపోయినా జరిగినట్లు సందేశాలు కనిపిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో ఆలస్యంగా అనూహ్యంగా పేలుళ్లు సంభవిస్తున్నాయని షార్ట్ ఫైరర్లు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమస్యలపై స్పష్టత కోసం సంబంధిత కంపెనీల సర్వీసింగ్ ఇంజనీర్లను యాజమాన్యం పిలిపించి చర్చలు నిర్వహించినప్పటికీ, కార్మికులు లేవనెత్తిన సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదని తెలిపారు. దీంతో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల పనితీరు, భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడి, కార్మికుల సందేహాలు నివృత్తి అయ్యే వరకు వాటి వినియోగాన్ని నిలిపివేసి, ప్రస్తుతం ఎలక్ట్రిక్ డిటోనేటర్లనే వినియోగించాలని యాజమాన్యాన్ని కోరారు. అలాగే మైనింగ్ సిబ్బందికి డిటోనేటర్ల తయారీ సంస్థల వద్ద ప్రత్యేక శిక్షణ కల్పిస్తే భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ నెల 15న కేటీకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షార్ట్ ఫైరర్ శ్రీరాములు ప్రదీప్‌కు సింగరేణి యాజమాన్యం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని, అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీనియర్ మైనింగ్ సర్దార్ హోదాలో తగిన విధంగా కొనసాగించే చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఖాళీగా ఉన్న ఓవర్‌మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 2016-17 బ్యాచ్ డిప్లొమా మైనింగ్ సర్దార్లకు ఓవర్‌మెన్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ గనుల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను యాజమాన్యం తక్షణమే చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి జి. శ్రీనివాస్, బ్రాంచ్ కమిటీ నాయకుడు తాళ్ల పోశం తదితరులు పాల్గొన్నారు.