
సింగరేణి అభివృద్ధిని పక్కనబెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
శ్రీరాంపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన సింగరేణి అధికారులు.
పీఆర్పీ బకాయిల చెల్లింపు, కొత్త పే-స్కేల్ అమలుకు డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
శ్రీరాంపూర్, జూన్ 19:
సింగరేణి సంస్థ అభివృద్ధి, అధికారుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి నాయకులు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అధికారుల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోదావరిఖనిలో ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాల కొనసాగింపుగా శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి అధికారులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోని వివిధ ఏరియాలకు చెందిన అధికారులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. నస్పూర్ కాలనీలోని మనోరంజన్ భవన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నాగార్జున కాలనీ, రాయల్ టాకీస్, సీసీసీ క్రాస్‌రోడ్డు మీదుగా మంచిర్యాల రోడ్డువరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం సీసీసీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎంఓఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, సింగరేణి అధికారులు, ఉద్యోగులు సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ సంస్థ నష్టాల్లో ఉందనే పేరుతో ప్రభుత్వం బకాయిల చెల్లింపులను వాయిదా వేస్తోందని విమర్శించారు. బొగ్గు సరఫరాకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి, ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, అందువల్లే నిరసన కార్యక్రమాలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. 1996లో బీఐఎఫ్‌ఆర్ సంక్షోభం నుంచి సింగరేణిని గట్టెక్కించడంలో అధికారులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ‘నా సింగరేణి’ అనే భావనతో సంస్థను లాభాల బాటలో నడిపించామని లక్ష్మీపతి గౌడ్ గుర్తుచేశారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వాల తరహాలోనే పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ (పనితీరు ఆధారిత చెల్లింపులు) బకాయిలను విడుదల చేయడంతో పాటు కోల్ ఇండియా తరహాలో కొత్త పే-స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం అందిస్తున్న సింగరేణిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని అధికారుల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు.