బాలాజీ స్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 5: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో స్వయం పరిపాలనా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, నిర్ణయాత్మక సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ విభాగాల బాధ్యులుగా వ్యవహరించి పాఠశాల పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించారు. తరగతులకు బోధన చేయడంతో పాటు విద్యార్థుల క్రమశిక్షణను పర్యవేక్షించడం, పాఠశాల కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను చేపట్టి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఆచరణాత్మక అనుభవంతో పాటు నాయకత్వ పటిమను పెంపొందించడమే తమ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్వయం పరిపాలనా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత భావన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయని ప్రిన్సిపాల్ రజినీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.