మనుబోతుల కొమురయ్యకు ఘన నివాళులు.
సింగరేణి కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు.
30వ వర్ధంతి సభను నిర్వహించిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, సెప్టెంబర్ 5: తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కార్మిక నాయకుడు, ఏఐటీయూసీ నాయకుడు మనుబోతుల కొమురయ్య 30వ వర్ధంతి సభను సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఉపాధ్యక్షుడు బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగిన సభలో కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కొమురయ్య తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. సింగరేణి పుట్టినిల్లైన ఇల్లందులో 1928 జూన్ 12న జన్మించిన ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను స్థాపించి కార్మికులను సంఘటితం చేసిన కొమురయ్య, కాంట్రాక్టు విధానానికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు వారసత్వ ఉద్యోగాల సాధనలో కీలక పాత్ర పోషించారని వక్తలు తెలిపారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాల ఫలితంగా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో సింగరేణి ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్ సాధించడంలో ఆయన కృషి కీలకమన్నారు. కొమురయ్య నాయకత్వంలోని పోరాటాల ఫలితంగా ఎనిమిది గంటల పనివిధానం, కాంట్రాక్టు విధానానికి వ్యతిరేక పోరాటం, మహిళా కార్మికులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు వంటి హక్కులు సాధించబడ్డాయని తెలిపారు. 1942 నుంచి 1996 వరకు సుమారు 44 ఏళ్ల పాటు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని, ప్రైవేట్ రంగ కార్మికుల హక్కులు, సౌకర్యాల కోసం జాతీయ స్థాయిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు పెన్షన్ సౌకర్యం సాధించడంలో కొమురయ్య కృషి మరువలేనిదని వక్తలు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా కార్మికులు గౌరవప్రదంగా జీవించాలనే లక్ష్యంతో సామాజిక భద్రత కోసం ఆయన పోరాడారని తెలిపారు. జాతీయ స్థాయిలో బొగ్గు గని కార్మికుల సమస్యలపై నిరాహార దీక్షకు పిలుపునిచ్చి, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పోరాడుతూనే 1996 సెప్టెంబర్ 5న తుదిశ్వాస విడిచారని సభలో స్మరించుకున్నారు. 30 ఏళ్లు గడిచినా సింగరేణి కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల హృదయాల్లో కొమురయ్య చిరస్మరణీయుడిగా నిలిచారని వక్తలు కొనియాడారు. ఆయన పోరాటాల ఫలితంగా సాధించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, నేటి తరానికి ఆ పోరాట చరిత్రను తెలియజేయాలని పిలుపునిచ్చారు. బంగారి రాజయ్య మాట్లాడుతూ, కొమురయ్య పోరాట స్ఫూర్తిని నేటి తరం కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని, కార్మిక ఐక్యతను బలోపేతం చేసి హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు. సీనియర్ విశ్రాంత ఉద్యోగి ఖాజా మొయినోద్దీన్ కొమురయ్యతో తనకున్న అనుబంధాన్ని, ఆయన కార్మికుల కోసం చేసిన పోరాటాలను సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆళవందార్ వేణు మాధవ్, బంగారి రాజయ్య, గీస కనకయ్య, రత్నదీప్ రెడ్డి, బొగే వెంకట్ స్వామి, ఎం. రాజనర్సు, కె. లక్ష్మయ్య, కొట్టే మల్లయ్య, ఏ. ప్రభాకర్, ఎం.డి. రఫిక్, అరుల్ కుమార్, ఎస్. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.