Take a fresh look at your lifestyle.

సింగరేణి 12 ఏరియాల్లో గెలుపే లక్ష్యం: జనక్ ప్రసాద్.

0 2

సింగరేణి 12 ఏరియాల్లో గెలుపే లక్ష్యం: జనక్ ప్రసాద్.

కార్మిక నాయకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.

సంజీవరెడ్డికి రాజ్యసభ, జనక్ ప్రసాద్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం.

గోదావరిఖని, సెప్టెంబర్ 6: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 12 ఏరియాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. శ్రీ జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కార్మిక నాయకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక సాయిలీల బాంక్వెట్ హాల్‌లో ఆదివారం సింగరేణి ఐఎన్‌టీయూసీకి చెందిన అర్జీవన్, అర్జీటూ, అర్జీత్రీ, భూపాలపల్లి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల విస్తృత స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి డా.జనక్ ప్రసాద్ అధ్యక్షత వహించగా, సెంట్రల్ కమిటీ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు, బ్రాంచ్, పిట్ సెక్రటరీలు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను చట్టసభల్లో సమర్థవంతంగా వినిపించేందుకు కార్మిక నాయకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. కార్మిక సంఘాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న డా.జనక్ ప్రసాద్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన డా. జి.సంజీవ రెడ్డికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇవ్వాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

12 ఏరియాల్లో గెలుపే లక్ష్యం:

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆరు ఏరియాల్లో గెలిచి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడామని జనక్ ప్రసాద్ తెలిపారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 12 ఏరియాల్లోనూ విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు యూనియన్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఏరియాల పరిధిలోని గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.మెడికల్ బోర్డు ప్రక్రియలో అనిశ్చితిని తొలగించడం, అన్‌ఫిట్ కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మికులకు సొంత ఇంటి కల సాకారం, మారుపేర్ల మార్పు, సింగరేణికి సి.పి. ఎస్.ఎస్. హోదా కల్పించడం, నూతన గనుల ప్రారంభం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జనక్ ప్రసాద్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వ సహకారం పొందే విధానాలపై కూడా చర్చించారు. 2023 ఎన్నికల్లో సింగరేణి కార్మికుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ పది అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంట్ స్థానాలు సాధించిందని సమావేశంలో నాయకులు గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చొరవ చూపాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, జెట్టి శంకర్ రావు, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, మహిళా అధ్యక్షురాలు శేషా రత్నం, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు సదానందం, సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, భూమయ్య, పేరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.