ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవాలి.
నవంబర్ 6 వరకు ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం.
సిపిఐ జిల్లా కార్యదర్శి మోటపలుకుల రమేష్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 25: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మోటపలుకుల రమేష్ విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్‌లో ఆదివారం నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో రమేష్ మాట్లాడుతూ, భూపాలపల్లి పట్టణ ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చి తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఎమ్మెల్సీ ఓటరుగా నమోదైనవారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు అవసరమైన పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్, ఓటరు గుర్తింపు కార్డు తదితర ధ్రువీకరణ పత్రాలతో కేంద్రానికి వచ్చి యూనియన్ కార్యకర్తల సహకారంతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు కీలకమని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రమేష్ పిలుపునిచ్చారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా తమకు నచ్చిన సమర్థవంతమైన అభ్యర్థిని ఎన్నుకుని పెద్దల సభకు పంపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నవంబర్ 6వ తేదీలోగా కొమురయ్య భవన్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఉచితంగా ఓటరు నమోదు చేయించుకోవాలని మోటపలుకుల రమేష్ విజ్ఞప్తి చేశారు.