
బొగ్గుగని కార్మికుల జేబీసీసీఐ–XII ఏర్పాటుకు మార్గం సుగమం!
సెక్షన్–14 నుంచి మినహాయింపు కోరుతూ బొగ్గు మంత్రిత్వ శాఖకు కోల్ ఇండియా లేఖ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 2: బొగ్గు పరిశ్రమలో 12వ జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ–XII) ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. జేబీసీసీఐ–XII ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న పారిశ్రామిక సంబంధాల కోడ్–2020లోని సెక్షన్–14 నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. కోల్ ఇండియా తీసుకున్న ఈ చొరవతో జేబీసీసీఐ–XII ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేబీసీసీఐ–XII ఏర్పాటుకు సంబంధించి గత సెప్టెంబర్ 3న జరిగిన సమావేశంలో పలు ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు సెక్షన్–14 నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. జేబీసీసీఐ–XII ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. తాజాగా కోల్ ఇండియా నేరుగా బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో ఈ ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పారిశ్రామిక సంబంధాల కోడ్–2020లోని సెక్షన్–14 ప్రధానంగా సంస్థల్లో కార్మిక సంఘాలకు చర్చా ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఒక సంస్థలో ఒకే నమోదిత కార్మిక సంఘం ఉంటే, దానిని ఏకైక చర్చా సంఘంగా యాజమాన్యం గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉన్నప్పుడు, మొత్తం కార్మికుల్లో కనీసం 51 శాతం మంది మద్దతు ఉన్న సంఘాన్ని ఏకైక చర్చా సంఘంగా గుర్తించే నిబంధన ఉంది. ఏ ఒక్క కార్మిక సంఘానికీ 51 శాతం మద్దతు లేని పరిస్థితిలో చర్చా మండలి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం 20 శాతం మంది కార్మికుల మద్దతు ఉన్న సంఘాలకు ఈ మండలిలో ప్రాతినిధ్యం లభిస్తుంది. ఆయా సంఘాలకు ఉన్న మద్దతు ప్రాతిపదికన ప్రతినిధిత్వం కల్పించే విధానం సెక్షన్–14లో పొందుపరిచారు. ఈ గుర్తింపు లేదా చర్చా మండలి వ్యవస్థకు నిర్దిష్ట కాలపరిమితి కూడా ఉంటుంది. ఈ నిబంధనల నేపథ్యంలో బొగ్గు పరిశ్రమలో ఇప్పటికే అమలులో ఉన్న ద్వైపాక్షిక చర్చల వ్యవస్థతో జేబీసీసీఐ–XII ఏర్పాటును సమన్వయం చేసేందుకు సెక్షన్–14 నుంచి మినహాయింపు అవసరమని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు కోల్ ఇండియా కూడా ఇదే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రిత్వ శాఖ నిర్ణయం వెలువడిన అనంతరం జేబీసీసీఐ–XII ఏర్పాటుకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బొగ్గు పరిశ్రమలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ద్వైపాక్షిక పారిశ్రామిక సంబంధాలకు జేబీసీసీఐ కీలక వేదికగా కొనసాగుతోంది. వేతనాలు, సేవా నిబంధనలు, ఉద్యోగుల సంక్షేమం, పని పరిస్థితులు, ఇతర కార్మిక సమస్యలపై యాజమాన్యం–కార్మిక సంఘాల మధ్య చర్చలు జరపడం, పరస్పర అవగాహనకు రావడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో జేబీసీసీఐ–XII ఏర్పాటు ద్వారా బొగ్గు పరిశ్రమలో తదుపరి వేతన ఒప్పందం సహా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై సంస్థాగత చర్చలకు వేదిక ఏర్పడనుంది. సెక్షన్–14 నుంచి మినహాయింపుపై బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. ఆ నిర్ణయం వెలువడితే జేబీసీసీఐ–XII ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. దీంతో బొగ్గు కార్మికులు, కార్మిక సంఘాలు మంత్రిత్వ శాఖ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.