గాంధీ జయంతి నాడు జర్నలిస్టుల నిరసన.
ఎమ్మెల్యే గండ్రకు వినతిపత్రం అందజేత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్–భూపాలపల్లి, అక్టోబర్ 2: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) కేంద్ర కార్యవర్గ నిర్ణయం, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని జర్నలిస్టులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ‘డిమాండ్ల దినం’గా పాటించారు. సుభాష్‌కాలనీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తమ రక్షణ, సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సమంతుల శ్యామ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై భారత రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు అందజేశారు. దీనిని రాష్ట్రపతికి చేరవేయాలని ఎమ్మెల్యేను కోరారు. దేశంలో తక్షణమే మీడియా కమిషన్ ఏర్పాటు చేసి, పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. చట్టపరమైన రక్షణతో పాటు వేతనాల సవరణకు కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సమగ్ర హెల్త్ కార్డులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యుడు సామల శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, చిట్యాల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య, జర్నలిస్టులు పుల్ల రవీందర్, సుబ్రహ్మణ్యస్వామి, సుధాకర్, రవి, కాట్రేవుల ఐలయ్య, శీలపాక ప్రణీత్‌కుమార్, నేరెళ్ల ఓదెలు, గుర్రం తిరుపతి, కట్కూరి రాజు, జీడి సురేష్, మాసు కుమార్, మైదం మహేష్, మ్యాదరి సునీల్, గొర్రె అనిల్ తదితరులు పాల్గొన్నారు.