Take a fresh look at your lifestyle.

సింగరేణిలో స్పెషల్ క్యాంపెయిన్–6.0.. పరిశుభ్రతకు పెద్దపీట : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.

0 6

సింగరేణిలో స్పెషల్ క్యాంపెయిన్–6.0.. పరిశుభ్రతకు పెద్దపీట.
ఈ-వేస్ట్, వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి.
భూపాలపల్లి ఏరియాలో 3.36 లక్షల చదరపు అడుగుల పరిధిలో పరిశుభ్రత పనులు.
ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 3: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్–6.0లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పరిశుభ్రతను కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి రోజువారీ బాధ్యతగా భావించి కార్యాలయాలు, పని ప్రదేశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. స్పెషల్ క్యాంపెయిన్–6.0లో భాగంగా శనివారం ఉదయం భూపాలపల్లి స్థానిక మైన్స్ రెస్క్యూ స్టేషన్ సమీపంలోని కనకదుర్గా అమ్మవారి ఆలయం ముందు ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి స్వయంగా పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగించి ట్రాక్టర్‌లో తరలించారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా వేరు చేసి నిబంధనల ప్రకారం సక్రమంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జీఎం సూచించారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 100 గంటలు, వారానికి కనీసం రెండు గంటల సమయాన్ని కేటాయించి పరిశుభ్రతా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పని వాతావరణానికి దోహదపడుతుందని తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్–6.0ను మూడు దశల్లో నిర్వహిస్తున్నట్లు జీఎం తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ప్రిపరేటరీ ఫేజ్, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్, నవంబర్ 17 నుంచి 30 వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్ కొనసాగుతాయని వివరించారు. గత ఏడాది నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్–5.0లో 52 ప్రదేశాల్లో మొత్తం 1,14,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి కంపెనీ వ్యాప్తంగా తృతీయ బహుమతి సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో 3,36,438 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రత పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జీఎం సూచించారు. పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సరైన నిర్వహణపై ప్రజలు, కార్మికుల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు.

కేటీకే-5 ఇంక్లైన్ లో  ఈ-వేస్ట్‌పై అవగాహన:

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇన్‌క్లైన్ పరిధిలోనూ స్పెషల్ క్యాంపెయిన్–6.0లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా సేకరించడం, తడి–పొడి, ఇతర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి సక్రమంగా పారవేయడంపై కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బంది కలిసి ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, ఆకులు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రమైన పని ప్రదేశం కార్మికుల ఆరోగ్యం, భద్రతతో పాటు సంస్థలో ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని యాక్టింగ్ గని మేనేజర్ పెద్దపాటి అభిషేక్ తెలిపారు. అనంతరం కార్మికులతో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. “పరిశుభ్రమైన గని–ఆరోగ్యకరమైన కార్మికుడు–సురక్షితమైన సింగరేణి” లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం రామున్ వి.పాఠక్, ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, డీజీఎం (ఫైనాన్స్) రాజేశ్వర్, సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ బాబుల్ రాజ్, పర్సనల్ ఆఫీసర్లు పి.విశ్రాంత్, వంశీతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేటీకే-5 ఇన్‌క్లైన్ కార్యక్రమంలో సంక్షేమ అధికారి సందీప్, సాగర్, సాజిత్, ఆసిఫ్ పాషా, మైనింగ్ సిబ్బంది, గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.