
కార్మిక సంఘాల కార్యాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదు.
నల్ల బ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన.
సీఎండీకి జేఏసీ ప్రతినిధుల మెమోరాండం.
కార్యాలయాల కూల్చివేతలకు యాజమాన్యమే బాధ్యత వహించాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 3: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మిక సంఘాల కార్యాలయాలను రోడ్డు విస్తరణ, మున్సిపల్ కమర్షియల్ భవనాల నిర్మాణం పేరుతో తొలగించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. కార్యాలయాల పరిరక్షణ కోసం శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, కేటీకే-5, కేటీకే-6, కేటీకే-8 గనులు, ఓసీ-2, ఓసీ-3తో పాటు ఏరియా వర్క్‌షాప్‌లు, వివిధ విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సింగరేణి సీఎండీకి సమర్పించేందుకు అధికారులకు జేఏసీ ప్రతినిధులు మెమోరాండం అందజేశారు. కార్మిక సంఘాల కార్యాలయాలను తొలగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, లీజు ఒప్పందాలను గౌరవిస్తూ సంఘాల హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘాల కార్యకలాపాల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం నామమాత్రపు అద్దె ప్రాతిపదికన లీజు ఒప్పందాల ద్వారా స్థలాలను కేటాయించిందని జేఏసీ నాయకులు తెలిపారు. ఆయా స్థలాల్లో సంఘాలు తమ సొంత నిధులతో కార్యాలయ భవనాలను నిర్మించుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మిక సంఘాల కార్యాలయాలు కేవలం భవనాలు మాత్రమే కాదని, వేలాది మంది కార్మికుల సమస్యలను పరిష్కరించే కేంద్రాలని జేఏసీ నాయకులు అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పారిశ్రామిక సంబంధాల మెరుగుదలకు ఇవి కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రభావిత సంఘాలతో సంప్రదింపులు జరపకుండా, నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయ కార్యాలయ స్థలంపై స్పష్టత ఇవ్వకుండా కూల్చివేత చర్యలకు పూనుకోవడం సమంజసం కాదన్నారు. భూపాలపల్లి రోడ్డు విస్తరణ ప్రజాప్రయోజనాల కోసం అవసరమైతే సంబంధిత లీజు ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనలు, కార్యాలయ భవనాలపై సంఘాలకు ఉన్న హక్కులను సమగ్రంగా పరిశీలించాలని జేఏసీ కోరింది. అన్ని పక్షాలతో చర్చించిన అనంతరం మాత్రమే చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. కూల్చివేత అనివార్యమని చట్టబద్ధంగా నిర్ధారణ అయితే, వర్తించే నిబంధనల ప్రకారం నష్టపరిహారం, ప్రత్యామ్నాయ కార్యాలయ స్థలం కల్పించే అంశాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కార్మిక సంఘాల కార్యాలయాల పరిరక్షణ విషయంలో సింగరేణి యాజమాన్యం తక్షణమే జోక్యం చేసుకోవాలని, జేఏసీ ప్రతినిధులతో అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా చర్యలు చేపడితే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యాలయాల పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడతాయని, కార్మికుల హక్కులు కాపాడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేటీకే-1 గనిలో ఎస్సీఎంకేఎస్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, రాసకట్ల నర్సింగరావు, ఒరం లక్ష్మణ్, శ్రీరాములు, కోటేష్, టీబీజీకేఎస్ నాయకులు సదానందం, గాండ్ల మొగిలి, మహేష్, ప్రవీణ్, అశోక్, రాంచందర్, మురళి, రాజేశ్వరరావు పాల్గొన్నారు. కేటీకే-5 గనిలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కామెర గట్టయ్య, ఎస్సీఎంకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వెలబోయిన సుజేందర్, రమేష్, మాలోత్ రాజునాయక్ పాల్గొన్నారు. కేటీకే-6 గనిలో ఎస్సీఎంకేఎస్ నాయకులు పండ్రాల మల్లేష్, చిలక కనకయ్య, శ్రవణ్‌కుమార్, స్వామి, టీబీజీకేఎస్ నాయకులు బాసనపల్లి కుమారస్వామి, వెంకట్రాజం, సుంకరి గోవర్ధన్, సడవలయ్య, మినుగు రవి, శ్రీధర్ పాల్గొన్నారు. కేటీకే-8 గనిలో ఎస్సీఎంకేఎస్ నాయకులు రేణుకుంట్ల మల్లయ్య, కాడారి శంకర్, ఆడప రాజు, డి.నారాయణ, శీలం రాజు, టీబీజీకేఎస్ నాయకులు అభినష్ రెడ్డి, చాకలి మురళి, రాజేందర్ పాల్గొన్నారు. కేటికె ఓసీ-2లో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మధుకర్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు బదితల సమ్మయ్య, సుదర్శన్, ఎం.సంపత్‌కుమార్, ఎస్సీఎంకేఎస్, బీఎంఎస్ నాయకులు రఘుపతి రెడ్డి, రాంచేందర్, మారం లక్ష్మణ్ పాల్గొన్నారు. ఓసీ-3లో మాలోత్ ప్రేమ్‌సింగ్, పోగుల శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, దాసరి ఓదెలు, వర్క్‌షాప్‌లలో శ్రీనివాస్ శంకర్‌తో పాటు వివిధ గనులు, విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.