వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలి: టీబీజీకేఎస్ అర్జీటూ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్.
వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలి.
దసరాలోపు 2025–26 లాభాల వివరాలు వెల్లడించాలి.. లేనిపక్షంలో సింగరేణి భవన్ వద్ద ఆందోళన.
టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
యైటింక్లైన్ కాలనీ, అక్టోబర్ 5: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ నికర లాభాలను వెంటనే వెల్లడించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాలో కనీసం 36 శాతాన్ని దసరాలోపు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వాస్తవ లాభాలను ప్రకటించకుండా సంస్థ అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టిబిజికేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆర్డీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన యూనియన్ నాయకులు, కార్మికులతో కలిసి సోమవారం సింగరేణి ఆర్జీ-2 డివిజన్ ఓసీపీ-3 గని మేనేజర్ సంపత్‌కుమార్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా సింగరేణి వాస్తవ లాభాలను కార్మికులకు స్పష్టంగా వెల్లడించకుండా, సంస్థ అభివృద్ధి పేరుతో భారీ మొత్తాలను పక్కన పెడుతున్నారని అన్నారు. 2023–24లో రూ.2,289 కోట్లు, 2024–25లో రూ.4,034 కోట్లు కలిపి మొత్తం రూ.6,323 కోట్లను సంస్థ అభివృద్ధి కోసం కేటాయించినట్లు చెబుతున్నారని తెలిపారు. అయితే ఉత్పత్తికి అవసరమైన కనీస స్థాయి యంత్రాలు, పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కార్మికులపై పనిభారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సింగరేణి లాభాలు పెరుగుతున్నాయని ప్రకటిస్తూ, మరోవైపు కార్మికులకు కనీస సౌకర్యాలు, ఉత్పత్తికి అవసరమైన పరికరాలు సమకూర్చకపోవడం సరికాదన్నారు.
కార్మికుల శ్రమతో సంస్థకు వస్తున్న వాస్తవ లాభాలను పారదర్శకంగా వెల్లడించి, అందులో కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించి, 36 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించకపోతే హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద ఆందోళన చేపడతామని ఐలి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్ల రవీందర్‌రెడ్డి, కూర తిరుపతి, మార్క నరేష్, ప్రాజెక్టు సెక్రటరీ మామిడి తిరుపతి, డి.శ్రీనివాస్, ముఖేష్, రామచందర్, దామర శీను, అంబి, రాకేష్, రాజశేఖర్, సాగి వెంకటేశ్వర్లు, పల్లె శంకర్, కొత్త రమేష్‌కుమార్, వై.రమేష్, కందుల తిరుపతి, దాడి కుమార్, శివ, వేణు, దొంగరి శ్రీనివాస్, సతీష్, రామచందర్, వంశీనాథ్, రాజశేఖర్‌రెడ్డి, దుర్గం శ్రీనివాస్, వేణు, శ్రావణ్, తిరుపతి, తిరుపతి శ్రీనివాస్, జంపన్న, తొగరి శ్రీనివాస్, మజార్, రజాక్, శ్రవణ్, మిథున్ తదితర నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.