Take a fresh look at your lifestyle.

వికసిత భారత్ సంకల్ప యాత్రలో….అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో

0 163

   

అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో

నిజామాబాద్ ,జనవరి 20 ( లోకం తీరు ) :   దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారతం సంకల్ప యాత్రలో భాగంగా 2024 జనవరి 20వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోగల రెండు పంచాయతీలను  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్, ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జి.కమల వర్ధనరావు సందర్శించారు. ఈ మేరకు ధర్పల్లి మండలం అమ్దాపూర్, బోధన్ మండలం మైలారం పంచాయతీలో సంకల్ప యాత్ర సభలకు వారు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఇంకా అందనివారికి సంతృప్తస్థాయిలో లబ్ధి చేకూర్చే సంకల్పంతో గౌరవనీయ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు.

ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని రెండు పంచాయతీల్లో నిర్వహించిన సంకల్ప యాత్ర సభలకు వారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో చొరవ చూపడంపై  ఎంపీకి  రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజారోగ్య సమస్యల పరిష్కారంలో కార్యక్రమ నిర్వహకులు, భాగస్వాములు అంకితభావం ప్రదర్శించడంపై వారికి సీఈవో ధన్యవాదాలు తెలిపారు.

కాగా, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య-ఆరోగ్యాధికారులతో కలసి ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ సీఈవో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల జారీలో సమస్యల వంటివాటిని తక్షణం పరిష్కరిస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ సుమారు 7.5 లక్షల మంది వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.

ఈ పంచాయతీలలో మధుమేహం, రక్తపోటు కేసులు చాలా తక్కువగా ఉండటాన్ని శ్రీ రావు ప్రశంసించారు. అయినప్పటికీ, సురక్షితంగాని, అనారోగ్యకరమైన ఆహారంతోపాటు ముఖ్యంగా పిల్లలు, మహిళల సంబంధిత ఆరోగ్య సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాల్సిందిగా ప్రజలకు ఆయన నొక్కిచెప్పారు. దేశంలో ఆహార భద్రత పథకం కింద ఏప్రిల్ నాటికి బలవర్ధక బియ్యం అందిస్తామని  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ హామీ ఇవ్వడాన్ని ఈ సభలో ఆయన గుర్తుచేశారు.

జిల్లా వైద్యాధికారులు గర్భిణుల విషయంలో జాగ్రత్తలు చేపట్టాలని, వారి దైనందిన పోషక అవసరాలను అర్థం చేసుకోవాలని సూచించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని, రసాయన ప్రత్యామ్నాయాలకన్నా సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సీఈవో సూచించారు.

నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర కేలండర్, కరదీపికలను ఆయన ఆవిష్కరించారు. అన్ని పథకాలు, మార్గదర్శకాల సమగ్ర వివరాలను తన ప్రసంగంలో భాగంగా ప్రజలకు వివరించారు.

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల కోసం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రతి పథకం సవ్యంగా అమలు చేయడంతోపాటు వాటి ప్రయోజనాలను లబ్ధిదారులకు కచ్చితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ‘పిఎం ఉజ్వల యోజన‘ కింద ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేపట్టాలని గౌరవనీయ ఎంపీ గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు. ఇక మైలారం పంచాయతీలో అర్హులైన 400 మంది గ్రామస్తులకుగాను 241 మంది మాత్రమే పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కోసం నమోదు చేసుకున్నారని, మిగిలిన వారి పేర్లు నమోదు చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఎంపీల్యాడ్స్‌ కింద మౌలిక వసతులతో పాఠశాల పునరుద్ధరణ, స్థానిక సమస్యల పరిష్కారంపైనా ఆయన హామీ ఇచ్చారు.
మూడేళ్లుగా ఈ ప్రాంతంలోని 513 మంది రేషన్ కార్డుదారులు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 2024 నుంచి మరో 5 సంవత్సరాలు పొడిగించడమే కాకుండా బలవర్ధక బియ్యం అందిస్తామని తెలిపారు.

ఇటువంటి పథకాలన్నిటి కింద లబ్ధిదారుల నమోదు కోసం రేషన్, ఆధార్ కార్డు మాత్రమే తప్పనిసరి పత్రాలని, దీంతోపాటు వివిధ పథకాల ప్రయోజనాలు పొందడం కోసం లబ్ధిదారులంతా ప్రధానమంత్రి జన్-ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరవాలని గౌరవనీయ ఎంపీ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.