Take a fresh look at your lifestyle.

సింగరేణిలో క్లర్క్‌గా చేరి.. క్లర్క్‌గానే రిటైర్ కావాలా? : కొత్తగూడెంలో విజయవంతమైన “సెక్రటేరియల్ స్టాఫ్ ఉద్యోగుల క్యాడర్ స్కీమ్ సాధన వేదిక”

0 1

సింగరేణిలో క్లర్క్‌గా చేరి.. క్లర్క్‌గానే రిటైర్ కావాలా?
సెక్రటేరియల్ సిబ్బంది పదోన్నతుల కోసం ఐక్య పోరాటం.
క్యాడర్ స్కీమ్ సవరణ, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి.

సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలి.

త్వరలో ఉద్యమ కార్యాచరణ: కార్మిక సంఘాల నాయకులు. 
కొత్తగూడెంలో విజయవంతమైన “సెక్రటేరియల్ స్టాఫ్ ఉద్యోగుల క్యాడర్ స్కీమ్ సాధన వేదిక”
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, అక్టోబర్ 10: సింగరేణిలో సెక్రటేరియల్ సిబ్బంది హక్కుల సాధనకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యార్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ క్లర్క్‌గా చేరిన ఉద్యోగి క్లర్క్‌గానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఎందుకని ఆయన ప్రశ్నించారు. అర్హతలు, అనుభవానికి తగిన పదోన్నతులు కల్పించి పీఏలు, ఓఎస్‌లను ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్యాడర్ స్కీమ్ సవరణ, ఖాళీల భర్తీతోపాటు సెక్రటేరియల్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. యూనియన్ల జెండాలు వేరైనా కార్మికుల హక్కుల పరిరక్షణే ఉమ్మడి లక్ష్యమని వివిధ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్‌లో ఆదివారం కొత్తగూడెం రీజియన్ కార్పొరేట్, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల సెక్రటేరియల్ ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. కార్పొరేట్ ఏరియా సెక్రటేరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నామ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, పదోన్నతుల విధానం, క్యాడర్ స్కీమ్ సవరణపై చర్చించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చి సెక్రటేరియల్ సిబ్బంది సమస్యలపై చర్చించడం ఈ సదస్సు ప్రత్యేకతగా నిలిచింది.

అర్హతలకు తగిన గుర్తింపు, పదోన్నతులు కల్పించాలి:

ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ, సింగరేణిలో డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు సాధించిన ఉద్యోగులకు వారి అర్హతలు, అనుభవానికి అనుగుణంగా పదోన్నతులు కల్పించకపోవడం అన్యాయమన్నారు. సంస్థలో మూడు దశాబ్దాలపాటు సేవలందించిన ఉద్యోగి సైతం క్లర్క్‌గానే పదవీ విరమణ చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రతిభను గుర్తించి ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కోల్ ఇండియాలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి, సింగరేణిలోనూ అర్హులైన ఉద్యోగులకు తగిన పదోన్నతులు కల్పించాలని కోరారు. సెక్రటేరియల్ సిబ్బంది సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని, క్యాడర్ స్కీమ్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. పీఏలు, ఓఎస్‌లకు పదోన్నతులు కల్పించి ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోకి తీసుకురావడంతోపాటు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని కోరారు. విధులకు అవసరమైన ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాలని, కంప్యూటర్ అలవెన్స్ మంజూరు చేయాలని, హాఫ్ పే లీవ్ (హెచ్‌పీఎల్) సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తేవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, ఈ డిమాండ్ల సాధనకు త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వంగ వెంకట్ తెలిపారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ చరవాణి ద్వారా సదస్సుకు తన సందేశాన్ని అందించారు.

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం:

ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ మాట్లాడుతూ, సింగరేణిలో అమలవుతున్న ఒప్పందాలు, వాటికి ఎప్పటికప్పుడు చేసిన సవరణల నేపథ్యంలో సెక్రటేరియల్ సిబ్బంది తమ ఐక్యతను కొనసాగించాలని కోరారు. ఏ యూనియన్ నాయకత్వంలో ఉన్నవారితోనైనా సత్సంబంధాలు పెంచుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇతర విభాగాల ఉద్యోగులు సంఘటితంగా పనిచేస్తున్నట్లే క్లరికల్ సిబ్బంది కూడా ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.

సిక్కా అధ్యక్షుడు బొల్లం మధు మాట్లాడుతూ, హక్కుల సాధనకు ఐక్యతతో కూడిన పోరాటం అవసరమన్నారు. సమస్యలపై పోరాడితే గొడవలు వస్తాయనే భయాన్ని వీడి, ఉద్యోగులంతా ఏకమై తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు కూడా యూనియన్ల మధ్య భేదాలు పక్కనపెట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సౌకర్యాలు కల్పించాలి:

సదస్సులో మాట్లాడిన క్లరికల్ సిబ్బంది, తమ సమస్యలకు నాయకులు అండగా నిలిస్తే హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ అలవెన్స్ మంజూరు చేయాలని, హెచ్‌పీఎల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సెక్రటేరియల్ సిబ్బంది నైపుణ్యాలను గుర్తించి, తగిన అవకాశాలు, పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, ఆఫీస్ బేరర్లు నాగయ్య, మల్లికార్జున్, మధుకృష్ణ; ఐఎన్టీయూసీ నాయకులు త్యాగరాజన్, ఆల్బర్ట్, బ్రాంచ్ కార్యదర్శి పీతాంబరం; బీఎంఎస్ సీనియర్ నాయకుడు, ఏబీకేఎంఎస్ కార్యదర్శి మాధవ నాయక్; సీఐటీయూ జనరల్ సెక్రటరీ మంద నరసింహారావు; హెచ్‌ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణప్రసాద్, సిక్కా జనరల్ సెక్రటరీ కె. శ్రీనివాసరావు, ట్రెజరర్ పోషయ్య, కార్పొరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బానోత్ రాంసింగ్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ట్రెజరర్ జయరాజు, అశోక్, రంజిత్, రాజ్ తిలక్, లచ్చిరాం, రాజేంద్ర ప్రసాద్, రాంచందర్, నరేష్ పాల్గొన్నారు. సంజీవ్, రమణ, దివ్య, సౌజన్య తదితరులు హాజరయ్యారు. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సెక్రటేరియల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.