Take a fresh look at your lifestyle.

వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ ఆరోపణలు.. పాల్వంచ హెచ్‌పీ గ్యాస్‌ మేనేజర్‌ ఆత్మహత్య.

0 3

వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ ఆరోపణలు.. పాల్వంచ హెచ్‌పీ గ్యాస్‌ మేనేజర్‌ ఆత్మహత్య.
సూసైడ్‌ నోట్‌లో పలువురి పేర్లు ప్రస్తావన.. ఆరోపణలపై దర్యాప్తుతోనే నిజానిజాలు వెలుగులోకి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, అక్టోబర్ 17: పాల్వంచలోని హెచ్‌పీ గ్యాస్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ భద్రాచలంలోని గోదావరి లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొందరు తనను డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధింపులకు గురిచేశారని, తాను నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నందుకే కక్షగట్టి మానసిక క్షోభకు గురిచేశారని ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌లో పలువురి పేర్లు ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లాడ్జి వద్దకు చేరుకోవడానికి ముందే  లక్ష్మీనారాయణ చనిపోయాడు.  పాల్వంచ హెచ్‌పీ గ్యాస్‌ బ్రాంచ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ బ్రాంచ్‌గా తీర్చిదిద్దిన అధికారిగా లక్ష్మీనారాయణకు గుర్తింపు ఉందని తెలిసింది. అయితే, కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాలని ఆమె తనపై ఒత్తిడి తెచ్చినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.  వినియోగదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేయడం, డెలివరీ ఆటో ద్వారా సంపాదించుకునే అవకాశం కల్పించడం వంటి అంశాల్లో తాను సహకరించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నోట్ లో ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.  కొత్తగూడెం గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి గ్యాస్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారని కూడా నోట్‌లో పేర్కొన్నారు.  2026 జూలై 27 నుంచి 21 రోజుల పాటు తాను సెలవులో వెళ్లినట్లు, తిరిగి ఆగస్టు 17న విధుల్లో చేరే సమయంలో పాల్వంచ గ్యాస్‌ కార్యాలయం నుంచి జిల్లా మేనేజర్‌ కార్యాలయానికి బదిలీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా మేనేజర్‌ను పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని లక్ష్మీనారాయణ నోట్‌లో వివరించాడు. పాల్వంచ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2025లోనే జిల్లా మేనేజర్‌కు లేఖ రాసినట్లు, తిరిగి విధుల్లో చేరే సమయంలోనూ కార్యాలయంలో కెమెరాలు లేకుండా పనిచేయడం కష్టంగా ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో తిరిగి పాల్వంచలో విధుల్లో చేరినట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న డేటా ఎంట్రీ ఆపరేటర్ భర్తతో పాటు ముగ్గురు విలేకరులు, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి పాల్వంచ గ్యాస్‌ కార్యాలయానికి వచ్చి తనను దూషించడంతో పాటు చంపుతామని బెదిరించినట్లు సూసైడ్‌ నోట్‌లో లక్ష్మినాయణ ఆరోపించాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సెప్టెంబర్‌ 30న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు, అక్టోబర్‌ 16న పాల్వంచ గ్యాస్‌ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ నిర్వహించినట్లు కూడా నోట్‌లో ప్రస్తావించాడు.

సోషల్‌ మీడియా, వార్తాపత్రికల్లో తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, నిజాయితీగా పనిచేస్తూ ఇతరులకు అక్రమంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వనందుకే తనపై కక్ష కట్టారని లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్ లో  పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు మరో ఆరుగురు కారణమని నోట్‌లో పేర్లు రాసినట్లు సమాచారం. ఘటనపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సూసైడ్‌ నోట్‌లోని ఆరోపణల నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.