1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ : ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం.
1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ అమలు.
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం.. సెప్టెంబర్ 1 నుంచి వర్తింపు.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, నవంబర్ 6:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ అమలులోకి రానుంది. రెండు నుంచి మూడు సంవత్సరాలుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు యాజమాన్యం నిర్ణయం ఊరటనివ్వనుంది. ఇటీవల కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 డిసెంబర్ 31వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరి బదిలీ వర్కర్ లేదా జనరల్ అసిస్టెంట్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి లేదా అంతకుముందు ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా భూగర్భ విభాగంలో పనిచేసిన వారు 190 పని దినాలు, ఓపెన్‌కాస్ట్ గనులు లేదా ఇతర బయటి విభాగాల్లో పనిచేసిన వారు 240 పని దినాలు పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారికే క్రమబద్ధీకరణ అవకాశం కల్పిస్తారు. సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు జనరల్ మేనేజర్ (పర్సనల్) పారిశ్రామిక సంబంధాలు, పర్సనల్ మేనేజ్‌మెంట్ విభాగం ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ విడుదల చేసింది. ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న అర్హుల జాబితాలను ఈ నెల 23వ తేదీలోగా సమర్పించాలని ఏరియా జనరల్ మేనేజర్లను యాజమాన్యం ఆదేశించింది. అర్హులుగా గుర్తించిన ఉద్యోగులను 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించనున్నారు. గతంలో బదిలీ వర్కర్ లేదా బదిలీ ఫిల్లర్ నుంచి జనరల్ మజ్దూర్‌గా క్రమబద్ధీకరణ పొందేందుకు కార్మికులు కొంతకాలం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపడుతున్నారని కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. క్రమశిక్షణతో, గైర్హాజరు లేకుండా విధులు నిర్వహించే బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ పొందే అవకాశం ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. ఉద్యోగులు ప్రతిరోజూ విధులకు హాజరై బాధ్యతాయుతంగా పనిచేస్తే ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతో పాటు సంస్థ అందించే సంక్షేమ ప్రయోజనాలను మరింతగా పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ పొందిన పలువురు ఉద్యోగులు ఆ తర్వాత జరిగిన అంతర్గత పదోన్నతులు, నియామకాల ప్రక్రియలో తమ అర్హతలకు అనుగుణంగా ఉన్నత ఉద్యోగాలు, పదోన్నతులు పొందారని గుర్తుచేసింది. గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో పనిచేస్తే క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్తులో పదోన్నతులకు కూడా అవకాశాలు ఉంటాయని సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు. విధులకు గైర్హాజరైతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, సింగరేణి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు ప్రతి ఉద్యోగి తనవంతు బాధ్యత నిర్వహించాలని సూచించారు. క్రమబద్ధీకరణ పొందనున్న కార్మికులకు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధి, విస్తరణకు ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తూ సహకరించాలని కోరారు.