పాత్రికేయులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి.
జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసిన పాత్రికేయ సంఘాలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 29: తనపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జర్నలిస్టు కుసుమ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు పాత్రికేయులు బుధవారం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనపై దాడికి సంబంధించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని వారు కోరారు. బాధిత జర్నలిస్టు కుసుమ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీన 19వ వార్డు కౌన్సిలర్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.19,500 విలువైన తన రియల్మీ ఎక్స్2 సెల్‌ఫోన్ ధ్వంసమైందని తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ఎస్పీని కోరారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధిత జర్నలిస్టు చంద్రశేఖర్‌కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.