కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి క్లరికల్ బదిలీలు నిలిపివేయాలి.
పెండింగ్లో ఉన్న ఇంటర్నల్ క్లరికల్ నియామకాలు చేపట్టాలి: ఎఐటీయూసీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, నవంబర్ 16:సింగరేణి కొత్తగూడెం ఏరియా నుంచి సత్తుపల్లి ఏరియాకు క్లరికల్ సిబ్బంది బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఎఐటీయూసీ నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కొత్తగూడెం ఏరియా క్లరికల్ సిబ్బంది తమ సమస్యలను వివరిస్తూ ఎఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు జక్కుల గట్టయ్య, ఎస్.వి. రమణమూర్తిలకు శేషగిరిభవన్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగ వెంకట్ మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియాలో ఇప్పటికే క్లరికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులతోనే రోజువారీ పరిపాలనా విధులు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత మంది సిబ్బందిని సత్తుపల్లికి బదిలీ చేస్తే కార్యాలయ కార్యకలాపాలు ప్రభావితమవడమే కాకుండా, మిగిలిన ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపడితే ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటర్నల్ క్లరికల్ నియామక ప్రక్రియను వేగవంతం చేసి, నియమితులైన వారిని సత్తుపల్లి ఏరియాలో నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత కౌన్సెలింగ్లో ఉన్న సుమారు 145 మంది జనరల్ అసిస్టెంట్లలో సాధ్యమైనంత మందిని సత్తుపల్లి ఏరియాలో సర్దుబాటు చేసి, యాక్టింగ్ క్లరికల్స్గా వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బందిని మరిన్ని బదిలీలు, డిప్యుటేషన్ల నుంచి మినహాయించాలని కోరారు. ఉద్యోగుల కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్యాభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం ప్రతిపాదిత బదిలీలపై పునరాలోచించాలని వంగ వెంకట్ విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఎఐటీయూసీ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సంఘం అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, కార్మికులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.