అర్హులైన ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలి.
ఔట్సోర్సింగ్ కార్మికులకు లాభాల బోనస్ వెంటనే చెల్లించాలి.
సింగరేణి జీఎం జి.వి. కిరణ్ కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, నవంబర్ 16: సింగరేణిలో అర్హులైన ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు ఔట్సోర్సింగ్ కార్మికులకు లాభాల బోనస్ వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జీఎం (పర్సనల్) ఐఆర్ అండ్ పీఎం జి.వి. కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం అన్ని ఏరియాల పర్సనల్ విభాగం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఏరియాల వారీగా అర్హులైన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు టైమ్ రేటెడ్, క్యాడర్ స్కీమ్ కింద పదోన్నతులు సకాలంలో కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఔట్సోర్సింగ్ కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపులపై సమీక్షిస్తూ, ఇప్పటివరకు బోనస్ చెల్లించని కాంట్రాక్టర్లతో వెంటనే మాట్లాడాలని, కార్మికులకు బోనస్ అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీజీఎంలు (పర్సనల్) ఎస్. వెంకటేశ్వరరావు, బి. రాజగోపాల్, డీవైపీఎం వి. దేవేందర్ రెడ్డి, అన్ని ఏరియాల పర్సనల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.