కోయగూడెం ఓసీ-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు : సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా హెచ్చరిక.
కోయగూడెం ఓసీ-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు.
బోడు రోడ్డు సెంటర్‌లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాలుగు గంటల రాస్తారోకో.
టెండర్ల ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలి.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం (టేకులపల్లి), నవంబర్ 16: సింగరేణి సంస్థకు చెందిన టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తోందని ఆరోపిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్‌లో ఇల్లందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై సుమారు నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. కోయగూడెం ఓసీ-3 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోలో సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల ఎన్నో ఏళ్ల త్యాగాలు, పోరాటాల ఫలితంగా అభివృద్ధి చెందిన సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికుల శాశ్వత ఉద్యోగాలు, హక్కులు, సంక్షేమ సౌకర్యాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోయగూడెం ఓసీ-3 నిర్వహణ బాధ్యతలను సింగరేణికే అప్పగించాలని, ప్రభుత్వం ప్రతిపాదించిన టెండర్ల ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సమ్మెతో పాటు మరింత విస్తృత స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే. సారయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రేసు ఎల్లయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, ఇల్లందు పట్టణ, మండల కార్యదర్శులు బాషా శ్రీనివాస్, బొమ్మిశెట్టి సత్యనారాయణ, వజ్జా చిరంజీవి, టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోతు రామచందర్, మాజీ మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య, ఉపసర్పంచ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.