
విద్యుత్ భద్రతా నిబంధనల అమలుతోనే ప్రమాదాల నివారణ.
సీఈఏ రెగ్యులేషన్స్-2023 పై సింగరేణి అధికారులకు ప్రత్యేక వర్క్‌షాప్.
ముఖ్య అతిథులుగా హాజరైన డీజీఎంఎస్ అధికారులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, నవంబర్ 20 :గనుల్లో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలను పక్కాగా పాటించడం ద్వారానే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) అధికారులు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో డీజీఎంఎస్ (సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్) ఆధ్వర్యంలో ‘సీఈఏ రెగ్యులేషన్స్-2023’ ప్రకారం విద్యుత్ భద్రతా నిబంధనలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎంఎస్ (ఎలక్ట్రికల్) కె. మహేశ్వర రెడ్డి, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) షేక్ నాగుల్ మీరా, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) దేవ్ కిషన్ శర్మ హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులను భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి, మొక్కలను బహుమతిగా అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సీఈఏ రెగ్యులేషన్స్ – 2023 నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకొని, విధి నిర్వహణలో తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. విద్యుత్ పరికరాల వినియోగం, నిర్వహణలో నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని, వ్యవస్థల్లో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా గనుల్లో ప్రమాదరహిత వాతావరణం కల్పించేందుకు అధికారులకు, ఉద్యోగులకు పలు కీలక సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్‌జీ రీజియన్ సేఫ్టీ జీఎం మల్లయ్య, ఎస్‌వో టూ జీఎం రమణ్ వి. పాఠక్, ఏజీఎం (ఈ&ఎం) సాంబశివరావు, ఓసీ-2 పీవో డి. శ్యాంసుందర్, ఓసీ-3 పీవో రామస్వామి, 1 గ్రూప్ ఏజెంట్ ఎం. తిరుపతి, జీవీటీసీ మేనేజర్ ఎం.డి. నజీర్, అన్ని గనుల మేనేజర్లు, ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.