Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలి : ఐఎన్టీయూసీ.

0 2

భూపాలపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలి.
ఎసిఎంఓ డాక్టర్ పద్మజకు ఐఎన్‌టీయూసీ నాయకుల వినతి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, నవంబర్ 17:భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎన్‌టీయూసీ నాయకులు ఏరియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఏసీఎంఓ) డాక్టర్ పద్మజను కోరారు. ఏరియా ఆసుపత్రి ఐఎన్‌టీయూసీ పిట్ సెక్రటరీ మహిబూబి పిలుపుతో మంగళవారం భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిని ఐఎన్‌టీయూసీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీఎంఓ డాక్టర్ పద్మజను కలిసి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఐఎన్‌టీయూసీ ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఎస్‌సీఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ) మహిళా విభాగం అధ్యక్షురాలు, రాష్ట్ర నాయకురాలు మద్దినేని శేషారత్నం, ఏరియా స్ట్రక్చర్ కమిటీ నాయకుడు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ.. సింగరేణి మెడికల్ నిబంధనల ప్రకారం స్టాఫ్ నర్సులకు అవసరమైన వాష్‌రూమ్, దుస్తులు మార్చుకునే గదులు ఆసుపత్రిలో అందుబాటులో లేవని, దీంతో మహిళా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆదివారాల్లో ప్లే డే విధుల్లో భాగంగా రెండు వార్డులకు కలిపి ఒక్క స్టాఫ్ నర్సు, ఒక్క వార్డు అసిస్టెంట్‌ను మాత్రమే నియమించడం వల్ల రోగులకు అవసరమైన సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధానాన్ని సమీక్షించి, వార్డుల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని కోరారు. అలాగే ఆసుపత్రిలో గుండె, నరాలు, కంటి, కిడ్నీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి నిపుణులైన వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలకు అవసరమైన రేడియాలజిస్టులను కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు ప్రస్తావించిన సమస్యలపై ఏసీఎంఓ డాక్టర్ పద్మజ సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సెక్రటరీ శ్వేత, బ్రాంచ్ నాయకుడు కుడుదుల శంకర్, ఎస్‌సీఎంఎల్‌యూ-ఐఎన్‌టీయూసీ యూత్ వింగ్ అధ్యక్షుడు ఎ. రాజు, ఏరియా ఆసుపత్రి ఐఎన్‌టీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శశి, సీనియర్ ఐఎన్‌టీయూసీ నాయకురాలు జీవకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.