కుట్రదారులకు వత్తాసు పలుకుతున్న రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయాలి.
పి.డి.యస్.యు డిమాండ్.
నిజామాబాద్, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) :తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలి. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న తె.యూ రిజిస్ట్రార్ యాదగిరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు) ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ తెలంగాణ యూనివర్సిటీ సెమినార్ హాల్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.యస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్ పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఈ భూముల్లో 54 ఎకరాలను మా సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్ లు సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎమ్మార్వో రవికుమార్ ను సస్పెండ్ చేశారన్నారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తె.యూ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి, అందుకు తగ్గ కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాశారన్నారు. దాంతో ఈ 54 ఎకరాల తె.యూ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి గారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తె. యూ భూములను అన్యాక్రాంతం చేయాలని కుట్రలు చేస్తే విద్యార్థులు ప్రజలు ప్రజాసంఘాలు ఊరుకోబోవని, పెద్దఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా డివిజన్ అధ్యక్షులు సాయిబాబా,
పి.డి.యస్.యుడిచ్పల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, రాజేష్ నాయకులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.