Take a fresh look at your lifestyle.

రామగుండం రీజియన్‌లో సింగరేణి సీఎండీ పర్యటన.

0 32

                                                                                                                                          రామగుండం రీజియన్‌లో సింగరేణి సీఎండీ పర్యటన.
గనులు, సీహెచ్‌పీల పరిశీలన.. అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ జట్టుకు అభినందనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మే 28:సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రామగుండం రీజియన్‌లోని ఆర్జీ-1, ఆర్జీ-2 ఏరియాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం రైలు మార్గం ద్వారా రామగుండం చేరుకున్న సీఎండీకి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లు ఘన స్వాగతం పలికారు. మొదట ఆర్జీ-2 ఏరియాలోని సీహెచ్‌పీని సందర్శించిన సీఎండీ బొగ్గు రవాణా, నాణ్యత ప్రమాణాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా రవాణా ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన సీహెచ్‌పీ బంకర్ పనులను పరిశీలించి, నిర్మాణ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. బంకర్ సామర్థ్యం, బొగ్గు రవాణా విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి ఆర్జీ ఓసీ-3 గనిని వ్యూ పాయింట్ ద్వారా పరిశీలించిన సీఎండీ, గని జీవితకాలం, ఉత్పత్తి లక్ష్యాలు, నాణ్యత ప్రమాణాలపై అధికారులతో చర్చించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్‌బర్డెన్ తొలగింపులో కూడా లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించిన సీఎండీ, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించిన రెస్క్యూ జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను ప్రశంసిస్తూ సంస్థకు వారు తీసుకొచ్చిన గౌరవాన్ని కొనియాడారు. తదనంతరం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-5 ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించి, అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, ఉత్పత్తి సామర్థ్యంపై ఏరియా జనరల్ మేనేజర్ సీఎండీకి వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, అడ్రియాలా ప్రాజెక్టుల జీఎంలు లలిత్ కుమార్, బండి వెంకటయ్య, మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు, జీఎం(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.