
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లో ఆలస్యం జరగొద్దని ఆదేశం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
నిర్మల్, మే 27:నిర్మల్ జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ఐకేపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేంద్రానికి వచ్చిన ధాన్యం పరిమాణం, ఇప్పటివరకు కొనుగోలు చేసిన నిల్వలు, తేమ శాతానికి చేరుకుని ఇంకా తూకం వేయాల్సిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత తేమ శాతానికి వచ్చిన వెంటనే ధాన్యాన్ని తూకం వేసి లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. అంతకుముందు జాఫ్రాపూర్ గ్రామంలోని పలు రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుతున్న ధాన్యం లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, మిల్లుల వద్ద వేచి ఉన్న లారీల సంఖ్య, అన్‌లోడింగ్ వేగంపై అధికారులను ఆరా తీశారు. రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యం అన్‌లోడింగ్‌లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని రైస్ మిల్లులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ధాన్యం కొనుగోలు మరియు అన్‌లోడింగ్ ప్రక్రియలను వెంటవెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్లు సంతోష్, శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.