Take a fresh look at your lifestyle.

సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన గుర్తింపు సంఘం.

0 27

సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన గుర్తింపు సంఘం.
కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం వివక్షత ఇక సహించం.
30 డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం.
కొత్తగూడెంలో కామ్రేడ్ మానుబోతుల కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 8:సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ ఏఐటీయూసీ పట్ల యాజమాన్యం వివక్షత ప్రదర్శిస్తోందని, కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సోమవారం సింగరేణి యాజమాన్యానికి అధికారికంగా సమ్మె నోటీసు అందజేసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో రెండో రోజైన సోమవారం నిర్వహించిన ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సింగరేణిలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను సమావేశంలో తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించిన “సింగరేణి జాత” విజయవంతం కావడంలో సహకరించిన నాయకులు, కార్యకర్తలు, కార్మికులకు నాయకులు అభినందనలు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిల విడుదల, కొత్త గనుల ప్రారంభం, మెడికల్ బోర్డు నిర్వహణ, 2025-26 లాభాల్లో 40 శాతం వాటా చెల్లింపు, మారుపేర్లు–విజిలెన్స్ కేసుల పరిష్కారం, సొంతింటి పథకం అమలు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారాన్ని యాజమాన్యమే భరించడం, క్లర్క్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టుల భర్తీ, 400 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు, డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, సహజ మరణం పొందిన కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఓవర్‌మెన్‌ల ప్రమోషన్లు తదితర సుమారు 30 డిమాండ్లను సమావేశంలో ప్రస్తావించారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం హోదాలో యాజమాన్యానికి అధికారికంగా సమ్మె నోటీసు అందజేసినట్లు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం కొనసాగితే దశలవారీ ఆందోళనలు చేపట్టి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవం:

అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కామ్రేడ్ మానుబోతుల కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింగరేణి కార్మిక ఉద్యమాల అభ్యున్నతికి, కార్మిక హక్కుల పరిరక్షణకు కొమురయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్మిక సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్, వీరస్వామి, వివిధ ఏరియాల బ్రాంచ్ కార్యదర్శులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కొమురయ్య కుటుంబ సభ్యులు, టౌన్ పార్టీ కార్యదర్శి జములయ్య, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.