Take a fresh look at your lifestyle.

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు:ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా – కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం రాజు.

0 17

సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు: ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా.

RFID, GPS, CCTVలతో పకడ్బందీ పర్యవేక్షణ.

బొగ్గు మాయమైందన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధం: జీఎం షాలేం రాజు.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో బొగ్గు మాయమైందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి టన్నుపై అత్యాధునిక డిజిటల్, భద్రతా పర్యవేక్షణ వ్యవస్థ అమలులో ఉందని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు ఆదివారం  ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణిలో ఉత్పత్తయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా అవుతుందని తెలిపారు. బొగ్గు రవాణా ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ, ఆన్‌లైన్ రికార్డింగ్, భద్రతా తనిఖీలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాకు SAP ఆధారిత వ్యవస్థ ద్వారా ముందస్తుగా కేటాయింపులు జరుగుతాయని, వాహనాల ఖాళీ బరువు, లోడింగ్ అనంతర బరువు ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జిల్లో నమోదు అవుతుందని వివరించారు. కేటాయించిన పరిమాణం సరిపోలిన తర్వాతే కంప్యూటర్ జనరేటెడ్ వే-బిల్ జారీ చేసి వాహనాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనానికి GPS/GPRS ట్రాకింగ్ తప్పనిసరి చేయడంతో పాటు జియోఫెన్సింగ్ సాంకేతికత ద్వారా వాహనాల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వాహనం నిర్దేశిత మార్గాన్ని విడిచిపెడితే సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు చేరుతాయని పేర్కొన్నారు. గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు (CHPలు), వెయిబ్రిడ్జిలు, స్టాక్ యార్డులు, రైల్వే సైడింగ్‌లు, ప్రవేశ-నిష్క్రమణ గేట్ల వద్ద RFID బూమ్ బ్యారియర్లు, వందలాది CCTV కెమెరాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు. అన్ని వెయిబ్రిడ్జిలు ‘కోల్‌నెట్’ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానమై ఉండటంతో ప్రతి లారీ, ప్రతి వ్యాగన్ బరువు ఆన్‌లైన్‌లో నమోదు అవుతుందని చెప్పారు. రైల్వే మార్గంలో కూడా ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ల (FSA) ప్రకారం విద్యుత్ కేంద్రాలు, ఇతర భారీ వినియోగదారులకు బొగ్గు సరఫరా జరుగుతుందని, ప్రతి వ్యాగన్‌లో నిర్దేశిత పరిమాణంలోనే లోడింగ్ చేపడుతున్నట్లు వివరించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద భౌతిక తనిఖీలు, హోలోగ్రామ్ చలానాల ధృవీకరణ జరుగుతుండగా, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జీఎం షాలేం రాజు మాట్లాడుతూ, “బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు ప్రతి టన్ను RFID, GPS, CCTV, కోల్‌నెట్, ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జిలు, సెక్యూరిటీ విభాగం, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, హోలోగ్రామ్ చలానాలు, టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి భద్రతా వ్యవస్థల మధ్య రవాణా అవుతోంది. ఈ పరిస్థితుల్లో బొగ్గు మాయమవడం లేదా చోరీ జరగడం అసాధ్యమే” అని స్పష్టం చేశారు. “ప్రతి టన్ను బొగ్గు డిజిటల్ పర్యవేక్షణలో, ప్రతి రవాణా భద్రతా నిఘాలోనే జరుగుతోంది. పారదర్శకత, బాధ్యత, సాంకేతికతే సింగరేణి బొగ్గు నిర్వహణకు మూల సూత్రాలు” అని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.