Take a fresh look at your lifestyle.

సింగరేణిలో కార్మికులే కాదు.. అధికారులు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది : హరీష్ రావు.

0 47

సింగరేణిలో కార్మికులే కాదు.. అధికారులు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.

బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు.
పీఆర్పీ బంద్, అధికారులపై వేధింపులు, పారదర్శకత లోపంతో సంక్షోభంలోకి సంస్థ .
సింగరేణి రాష్ట్ర సంపద.. రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కొత్తగూడెం, జూన్ 24: సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కార్మికులతో పాటు అధికారులు కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేసే దుస్థితి ఏర్పడిందని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలోని క్లబ్‌లో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా అధికారులు ర్యాలీలు నిర్వహిస్తూ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామగుండం, మంచిర్యాల, శ్రీరాంపూర్‌తో పాటు తాజాగా కొత్తగూడెంలో కూడా అధికారులు భారీ ర్యాలీలు నిర్వహించడం సంస్థలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమన్నారు. ప్రొడక్షన్ రిలేటెడ్ పే (పీఆర్పీ) అంశాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది అధికారులు, ఉద్యోగులకు పీఆర్పీ అందించేవారని, సంస్థ పనితీరును ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండున్నర సంవత్సరాలుగా పీఆర్పీ నిలిచిపోయిందని విమర్శించారు. ఈ పరిస్థితి అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసిందన్నారు.

అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి:

సింగరేణిలో అధికారులపై వేధింపులు పెరిగాయని హరీష్ రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, పారదర్శకత లోపించిందని అన్నారు. యాజమాన్యం చెప్పిన విధంగా వ్యవహరించకపోతే బదిలీలు, రివర్షన్లు వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కారణంగానే అధికారులు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

సింగరేణి చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎన్నడూ జరగలేదని పేర్కొంటూ, సంస్థలో జరుగుతున్న అక్రమాలు, తప్పిదాలు, అవకతవకలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఎన్ని స్కాములు చెప్పాలి.. ఎన్ని తప్పులు బయటపెట్టాలి.. అసలు సింగరేణి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత:

సింగరేణి అంశాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కార్మికులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కావని, కానీ సింగరేణి రాష్ట్రానికి చెందిన అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. ఈ సంస్థ భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తాను ప్రస్తావించిన బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, సంస్థ నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలపై కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత చర్చ చేపట్టాలని సూచించారు. సింగరేణి భవిష్యత్తు కోసం లోతైన సమీక్ష అవసరమని, సంస్థను రక్షించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగరేణి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి సంస్థ అని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువుగా మార్చకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.